రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: హైకోర్టులో సచిన్ వర్గానికి ఊరట
హైకోర్టులో వర్గానికి ఊరట లభించింది. అసమ్మతి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా.. యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన అనిశ్చితిపై శుక్రవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చేర్చాలన్న అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కేంద్రాన్ని చేర్చడానికి హైకోర్టు అంగీకరించడంతో ఈ అంశం పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హాజరై వాదనలు వినిపించనున్నారు. అనర్హత అంశం రాజ్యాంగ నిబంధనలకు సవాల్‌గా ఉందని, అందువల్ల తప్పనిసరిగా ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని సచిన్ వర్గం తరఫున లాయర్ వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతీ, జస్టిస్ ప్రకాశ్ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం దీనికి సమ్మతించింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో హైకోర్టు గడువు విధించడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు, దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలియజేసే హక్కు ఉందని, బలవంతంగా అణచివేయలేరని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
By July 24, 2020 at 11:37AM
No comments