Breaking News

సీఎంఓ తాకిన బంగారం స్మగ్లింగ్ కేసు.. కేరళలో రాజకీయ ప్రకంపనలు


విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని గత శనివారం కేరళ రాజధాని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు ప్రస్తుతం కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌‌కు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోన్న ఎం శివశంకర్‌పై తాజాగా వేటు పడింది. ఈ కేసులో కేరళ ఐటీ శాఖ మహిళా ఉద్యోగి స్వప్న సురేశ్‌తోపాటు తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌లో పనిచేస్తున్న మరో వ్యక్తి సరిత్‌ కుమార్‌ పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్న.. ఐటీ శాఖలో ఆరు నెలల ఒప్పందం ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నట్టు తేల్చారు. ఈ క్రమంలోనే శివశంకర్‌పై కూడా ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం మంగళవారం ఆయనను సీఎం కార్యదర్శి విధుల నుంచి తొలిగించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నను అరెస్టు చేశామని అధికారులు చెప్పారు. పట్టుబడ్డ నిందితుడు సరిత్‌, గతంలో యూఏఈ కాన్సులేట్‌లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. స్వప్నా సురేశ్‌ కూడా ఇదే కార్యాలయంలో పనిచేసింది. దీంతో కేరళ ఐటీ శాఖలో పనిచేసే స్వప్నా సురేశ్‌ బంగారం స్మగ్లింగ్ కోసం నకిలీ కాన్సులేట్‌ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసిన స్వప్నా‌ను కేరళ ఐటీ శాఖలో ఏ ప్రాతిపదికన నియమించారనే అంశంపైనే .. శివశంకర్‌ను తొలగించినట్లు సమాచారం. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు స్వప్నాపై లుక్ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. సీఎంవో నుంచి నేరుగా ఫోన్లు వెళ్లడం వల్లే.. బంగారం స్మగ్లింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కస్టమ్స్ నిర్థారణకు వచ్చింది. మరోవైపు ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం... రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. బంగారం అక్రమ రవాణాలో సీఎంవో పాత్ర ఉన్నట్లు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. విపక్ష నేత రమేశ్ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. యూఏఈ కాన్సులేట్ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్నవారు... అంతర్జాతీయ స్మగ్లర్‌లతో కలిసి దందా సాగిస్తున్నట్లు రమేశ్ ఆరోపించారు. స్వప్నా సురేశ్.. తిరువనంతపురంలో ఓ ట్రావెల్ ఏజెన్సీని సొంతంగా నడుపుతుండేది.. అనంతరం 2010-11లో అబుదాబికి మకాం మార్చింది. అబుదాబి ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల సేవల విభాగంలో పనిచేసి.. తర్వాత కేరళకు తిరిగొచ్చి ఎయిరిండియా శాట్స్‌లో చేరింది. సంస్థలోని పలువురు తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు గుప్పించి, ఉద్యోగం నుంచి తప్పుకుంది. తర్వాత యూఏఈ కాన్సులేట్‌లో చేరినా.. ఆమె ప్రవర్తన నచ్చక యాజమాన్యం తొలగించింది. అక్కడ నుంచి కేరళ ప్రభుత్వ ఐటీ విభాగంలో తాత్కాలిక ఉద్యోగినిగా చేరింది.


By July 08, 2020 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-gold-smuggling-case-knocks-at-the-door-of-cms-office/articleshow/76847942.cms

No comments