సీనియర్‌పై కాల్పులు.. అదే రివాల్వర్‌తో కాల్చుకుని సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య
తనపై అధికారిపై కాల్పులు జరిపి, తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కేంద్ర హోం శాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. లోధి ఎస్టేట్ ఏరియాలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఎస్‌ఐ మరో ఇన్‌స్పెక్టర్‌పై కాల్పులు జరిపి, తర్వాత అదే రివాల్వర్‌తో తను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకునేసరికి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనలో మృతిచెందినవారిని సీఆర్పీఎఫ్ 122వ బెటాలియన్ సబ్-ఇన్‌స్పెక్టర్ కర్నైల్ సింగ్, ఇన్‌స్పెక్టర్ దశరథ్ సింగ్‌గా గుర్తించారు. ఘటనకు ముందు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆవేశం తట్టుకోలేక దశరథ్ సింగ్‌పై కర్నైల్ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఇన్స్పెక్టర్ తన గదిలో భోజనం చేస్తున్నప్పుడు సబ్-ఇన్స్పెక్టర్ అతనిపై కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. తరువాత బంగ్లాలోని గార్డు గది సమీపంలో ఉన్న ప్రవేశ ద్వారం వద్ద తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐ కర్నైల్ సింగ్ స్వస్థలం జమ్మూ కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ కాగా... ఇన్‌స్పెక్టర్ దశరథ్ హరియాణాలోని రోహతక్.
By July 25, 2020 at 11:24AM
No comments