దేశంలో పెరిగిన పాజిటివ్ కేసుల రేటు.. కారణం ఇదేనట!
దేశంలో ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,310 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గత 15 రోజుల్లో పాజిటవ్ కేసుల రేటు 10.66 నుంచి 13 శాతానికి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. టెస్టింగ్ సామర్ధ్యం పెరగడంతోనే పాజిటివ్ కేసుల రేటు పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకు టెస్టింగ్ సామర్థ్యం పెరగడమే కారణమని, రాబోయే రోజుల్లో వైరస్ పీఠభూమి దశకు చేరుకుంటుందని ప్రభుత్వ అధికారులు అన్నారు. కానీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, దీనికి నియంత్రణ చర్యలు వైఫల్యమే కారణమని వ్యాఖ్యానించారు. వివిధ ప్రదేశాలలో మహమ్మారి వివిధ దశల్లో ఉందని, ఇది వ్యాప్తి ధోరణికి అద్దం పడుతోందన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, అసోం, బిహార్, ఒడిశాలోని ప్రధాన నగరాల నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వైరస్ వ్యాపించింది. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా చాలా మెట్రో నగరాలలో కేసులు స్థిరంగా ఉన్నప్పటికీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. మహమ్మారి కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24 గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పరీక్షలు చేశారు. దేశంలో మొత్తం ల్యాబ్‌లలో 897 ప్రభుత్వ లేబొరేటరీలు కాగా.. 393 ప్రైవేటు సెక్టార్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.
By July 25, 2020 at 09:24AM
No comments