Breaking News

కేరళ, కర్ణాటకలో భారీగా ఐఎస్ ఉగ్రవాదులు.. ఐరాస సంచలన నివేదిక


భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్), అనుబంద ఉగ్రవాద ముఠాలు కదలికలు ప్రబలంగానే ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. ఐసిస్ సభ్యులు కేరళ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో తిష్ఠ వేశారని పేర్కొంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ‘అల్‌ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) ఎక్కువగా ఉందని వెల్లడించింది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌లో ఎక్యూఐఎస్ సభ్యులు 150-200 మంది ఉండొచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో దాడులకు కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించింది. ఐసిస్‌, తాలిబన్‌ కనుసన్నల్లో ఏక్యూఐఎస్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. అఫ్గానిస్థాన్‌లోని నిమ్రుజ్‌, హెల్మండ్‌, కాందహార్‌ ప్రావిన్స్‌ల నుంచి ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది. ఏక్యూఐఎస్‌ ప్రస్తుత నేత ఒసామా మహ్మద్‌.. సైన్యం చేతిలో హతమైన అసిమ్‌ ఉమర్‌ స్థానంలో అతడు పగ్గాలు చేపట్టాడు. అసిమ్‌‌ను చంపినందుకు ప్రతీకారంగా ఈ ప్రాంతంలో దాడులు చేయాలని ఐసిస్‌ కుట్రలు పన్నుతోంది. ఐసిస్‌కు చెందిన భారత అనుబంధ ముఠా (హింద్‌ విలాయాహ్‌)లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారు. కేరళ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఐసిస్‌ ముష్కరులు ఉన్నారు. భారత్‌లో కొత్తగా ఒక ‘ప్రావిన్స్‌’ను ఏర్పాటు చేసినట్లు గత ఏడాది మేలో ఐసిస్‌ పేర్కొంది. ఐసిస్, అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలపై కోవిడ్ -19 ప్రభావం చూపిందని పర్యవేక్షణ బృందం తెలిపింది. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఉగ్రవాదుల ప్రణాళికకు అంతరాయం కలిగిందని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం వల్ల ఉగ్రవాద నెట్‌వర్కింగ్, ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్టు వివరించింది. కోవిడ్ ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న లక్ష్యాల సంఖ్య తగ్గిందని పేర్కొంది. బహిరంగ సభలపై నిషేధం, వేదికలు మూసివేయడంతో దాడులకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదని వివరించింది.


By July 26, 2020 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/big-number-of-is-and-al-qaida-agents-from-karnataka-kerala-un-report/articleshow/77177588.cms

No comments