Breaking News

అధికారుల నిర్వాకం.. భార్యకు కోర్టు బెయిలిస్తే భర్తను విడుదల చేశారు!


ఓ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యాభర్తలు అరెస్టయి జైల్లో ఉండగా.. వారిలో ఒకరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. భార్యకు కోర్టు బెయిల్ మంజూరుచేయగా.. జైలు అధికారులు మాత్రం భర్తను విడుదల చేయడం విశేషం. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సేలం జిల్లా ఎత్తాపుర్‌ సమీపంలోని వెల్లాల్‌పట్టే గ్రామానికి చెందిన భార్యాభర్తలు రంజిత్‌ కుమార్‌, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జులై 23న జరిగిన ఈ హత్య కేసులో రంజిత్, పవిత్రలను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం సేలం సెంట్రల్‌‌కు తరలించారు. అదే రోజు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును పవిత్ర ఆశ్రయించింది. బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆమెకు శనివారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అదే రోజు రాత్రి ఈ బెయిల్ పత్రాలను అందుకున్న అధికారులు.. పవిత్రను విడుదల చేయకుండా పొరపాటున ఆమె భర్త రంజిత్‌ను విడుదల చేశారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా.. పవిత్రను ఎందుకు విడుదల చేయలేదని ఆమె బంధువులు ప్రశ్నించడంతో అధికారులు నాలుక్కరుచుకున్నారు. తమ తప్పును తెలుసుకున్న జైలు అధికారులు హుటాహుటిన ఎత్తాపుర్‌కు చేరుకొని, రంజిత్‌ను తిరిగి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అనంతరం నుంచి పవిత్రను విడుదల చేశారు. ఈ ఘటనపై జైలు సూపరింటిండెంట్ విచారణకు ఆదేశించారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా లేక పొరపాటున జరిగిందా? అనేది డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీలో తేలుతుందని సూపరింటిండెంట్ తమిళసెల్వన్ అన్నారు. దీనికి బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


By July 27, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prison-officials-release-husband-instead-of-wife-on-bail-in-tamil-nadu/articleshow/77190547.cms

No comments