తాజ్‌మహల్ సందర్శనకు మరికొన్నాళ్లు ఆగాల్సిందే.. వెనక్కు తగ్గిన యూపీ సర్కారు
లాక్‌డౌన్ కారణంగా దేశంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌లో చారిత్రక కట్టడాల సందర్శనకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో.. జులై 6 నుంచి తాజ్ మహల్‌కు పర్యాటకులను అనుమతిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిమిషంలో దీనిని వాయిదా వేసింది. తాజ్‌మహల్ సందర్శన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సందర్శకుల తాడికి వల్ల కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగ్రాలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అన్‌లాక్ 2.0లో సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం చెప్పింది. అయితే, పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయం తీసుకునే అధికారం విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతించాలని భావించినా పరిస్థితులు అనుకూలంగా లేవని జిల్లా యంత్రాంగం నివేదించింది. ప్రఖ్యాత కట్టడాలు తాజ్‌మహల్, ఎర్రకోట సహా అనేక స్మారక, సందర్శనీయ ప్రాంతాలను జులై 6 నుంచి తిరిగి తెరవనున్నట్టు కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల కిందట ప్రకటించింది. తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు వీటిని సందర్శించ వచ్చని వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో 3,400కు పైగా సందర్శనీయ ప్రాంతాలను భారత పురావస్తు పరిశోధన సంస్థ (ఏఎస్‌ఐ) మార్చి 17న మూసేసింది. లాక్‌డౌన్ కొనసాగడంతో దాదాపు జూన్ మధ్య వరకు అన్నీ మూసేశారు. అన్‌లాక్ 1 దశ మొదలైనప్పుడు దాదాపు 820 ఆధ్యాత్మిక ప్రాంతాలను పునః ప్రారంభించారు. మిగిలిన సందర్శనీయ కేంద్రాలను తెరిచేందుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ తీవ్రతను బట్టి తెరవాలో, మూసేయాలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని వెల్లడించింది.
By July 06, 2020 at 11:34AM
No comments