Breaking News

అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేత.. లైంగిక ఆరోపణలతో ఆత్మహత్య!


దక్షిణ కొరియా నేత, పార్క్ వోన్-సూన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మర్నాడే బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుల్లో పార్క్-వోన్ సూన్ ఒకరు కావడం విశేషం. ఆయన మృతదేహాన్ని సియోల్‌లోని ఓ పర్వతం వద్ద గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న అత్యంత ఉన్నతస్థాయి రాజకీయ నేత కాగా.. మీటూ ఉద్యమం వివిధ రంగాలలోని ప్రముఖుల పతనానికి దారితీసింది. పార్క్ స్వహస్తాలతో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘అందరికీ క్షమాపణలు.. నా జీవితంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ఆయన రాశారు. అంతేకాదు, దహన సంస్కారాలు నిర్వహించి, చితాభస్మాన్ని తన తల్లిదండ్రుల సమాధుల వద్ద భద్రం చేయాలని కోరాడు. కుటుంబానికి బాధ కలిగించానని, తనను క్షమించాలని లేఖలో పేర్కొన్నాడు. అందరికీ వీడ్కోలు.. అంటూ లేఖ చివరిన సంతకం చేసిన పార్క్.. తనపై ఆరోపణలు చేసిన వారి గురించి ప్రస్తావించలేదు. అధికార డెమొక్రాటిక్ పార్టీలో కీలక నేతగా ఉన్న పార్క్.. గతంలో మానవ హక్కుల న్యాయవాదిగా పనిచేశారు. లింగ, సామాజిక సమానత్వం నినాదంతో మూడుసార్లు ఎన్నికల్లో గెలిచిన పార్క్.. 2022 ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షుడు మూన్ జై-న్ స్థానాన్ని తాను భర్తీచేస్తానని ప్రకటించారు. పార్క్‌-సూన్‌పై ఆయన మాజీ సెక్రెటరీ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మర్నాడే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆయన.. ఓ పర్వతం వద్ద విగతజీవిగా కనిపించారు.


By July 10, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/seouls-missing-mayor-park-found-dead-after-massive-search-kills-himself/articleshow/76888241.cms

No comments