కళ్లెదుటే ఉగ్రతూటాలకు తల్లిదండ్రులు బలి.. సింహంలా దూకి ఇద్దర్ని మట్టుబెట్టిన బాలిక
తల్లిదండ్రులను తన కళ్లెదుటే ఉగ్రవాదులు కాల్చిచంపడంతో ఓ బాలిక ఆవేశంతో రగిలిపోయింది. ఉగ్రవాదులపై సివంగిలా దూకి వారి భరతంపట్టింది. తన తల్లిదండ్రులను చంపిన ముష్కరులపై గుళ్ల వర్షం కురిపించి, ప్రతీకారం తీర్చుకుంది. అఫ్గనిస్థాన్‌లో గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లకు చెందిన ఓ గ్రామ పెద్ద ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో తాలిబన్ ఉగ్రవాదులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ గ్రామ పెద్దను చంపాలని నిర్ణయించి .. జులై 17 రాత్రి అతడి ఇంటికి వెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వెళ్లి తలుపుకొట్టగా బాలిక కమర్‌గుల్ తల్లి తలుపు తీసింది. అయితే, వచ్చింది ఉగ్రవాదులని గ్రహించిన ఆమె వెంటనే తలుపులు మూసేయడానికి ప్రయత్నించింది. దీంతో ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపి లోపలికి చొరబడి బాలిక తండ్రిని బయటకు ఈడ్చుకొచ్చి కాల్చి చంపారు. తన కళ్ల ముందే తల్లిదండ్రులు చనిపోవడంతో హతాశురాలైన బాలిక.. వెంటనే తేరుకుంది. ఇంట్లో ఉన్న ఏకే-47 తుపాకి తీసుకుని తన తల్లిదండ్రులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి పారేసింది. ఈ విషయం తెలిసి మరికొందరు ఉగ్రవాదులు అక్కడకు రాగా.. గంటకుపైగా వీరోచితంగా పోరాడింది. తనతోపాటు ఉన్న 12 ఏళ్ల తమ్ముడిని కాపాడుకుంటూనే ఉగ్రవాదులను నిలువరించింది. ఈ లోగా విషయం తెలిసిన గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలీషియా సభ్యులు అక్కడకు రావడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. బాలిక జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమవ్వగా.. మరి కొందరు గాయపడ్డారు. ఉగ్రవాదులపై పోరాడి అసమాన ధైర్యసాహసాలు చూపిన కమర్, ఆమె తమ్ముడిని అఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అభినందించారు. అంతేకాదు, వారిన తమ అధికార నివాసానికి ఆహ్వానించారు.
By July 22, 2020 at 12:17PM
No comments