Breaking News

చంద్రయాన్-2కి ఏడాది పూర్తి.. ప్రయోగ ఫలితాలపై ఇస్రో కీలక ప్రకటన


చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగానికి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి ఉపయోగపడే చంద్రయాన్ -2 పంపిన వివరాలను అక్టోబర్‌లో విడుదల చేస్తామని, ఆర్బిటర్‌లోని ఎనిమిది పేలోడ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపింది. 2019 జులై 22న శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించగా.. ఆగస్టు 20న ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యకు చేర్చింది. ‘ఆగస్టు 20న చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరింది.. అందులో ఎనిమిది పేలోడ్లు ప్రస్తుతం సక్రమంగా పనిచేస్తున్నాయి.. మిషన్ ప్లాన్ ప్రకారం చంద్రుడి ఉపరితలం, ధ్రువం కవరేజ్ గ్లోబల్ మ్యాపింగ్ జరుగుతోంది’ అని ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది. చంద్రయాన్ -2 పేలోడ్ల నుంచి విస్తృతమైన డేటా లభించింది. 1) ధ్రువ ప్రాంతాలలో నీరు-మంచు ఉండటం, 2) ఎక్స్-రే ఆధారిత, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపిక్ ఖనిజ సమాచారం, మధ్య, ఆధిక అక్షాంశం వద్ద రేడియోధార్మిక క్షయం ద్వారా అంతర్గతంగా విడుదలయ్యే చంద్రుడిపై ఘనీభవించిన వాయువు ఆర్గాన్-40 ఉనికి గురించి సమాచారం పొందినట్టు పేర్కొంది. చంద్రయాన్ -2 ఫలితాల నివేదికను ఈ ఏడాది మార్చిలో జరిగే వార్షిక విజ్ఞాన సదస్సులో విడుదల చేయాలని భావించారు. అయితే కోవిడ్-19 కారణంగా దీనిని రద్దు చేశారు. ప్రపంచం ఉపయోగం కోసం చంద్రయాన్ -2 సైన్స్ డేటాను అక్టోబరులో వెల్లడిస్తామని, ఇందులో డేటాను పొందడానికి వివరాలు అందజేయనున్నట్టు వివరించింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 యాత్రకు బుధవారంతో ఏడాది పూర్తవుతోంది. ల్యాండింగ్‌ జరిగే సమయంలో ల్యాండరు చంద్రుడి ఉపరితలం నుంచి 2.1 కి.మీ ఎత్తున ఉండగా దానికి భూమితో సంబంధం తెగిపోయింది. అయినా ఈ యాత్ర 90 నుంచి 98 శాతం విజయవంతమైందని ఇస్రో అప్పట్లో ప్రకటించింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం చంద్రునిపై ల్యాండర్ సాఫ్ట్‌ ల్యాండింగ్‌, చంద్రుడి ఉపరితలంపై రోవరును నడపడం, శాస్త్ర బంధ లక్ష్యాలు, చంద్రుని ఉపరితలంపై పరిశోధన, ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యతను శోధించడం, చంద్రుని వాతావరణాన్ని పరిశీలించడం, మంచు రూపాల్లోని నీటి లభ్యతను పరిశీలించడం, చంద్ర ఉపరితలాన్ని ఫొటోలు తీసి 3డి మ్యాపులు తయారు చేయడంలాంటివి ఉన్నాయి.


By July 22, 2020 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-will-be-relese-chandrayaan-2-data-from-october-all-8-payloads-performing-well/articleshow/77101473.cms

No comments