శ్రీనగర్‌లో ఎదురుకాల్పలు.. ఇద్దరు ముష్కరులు హతం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకల భరతం పడుతోన్న సైన్యం.. తాజాగా, శనివారం మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది. శనివారం ఉదయం శ్రీనగర్ శివార్లలోని రణ్‌బీర్ గఢ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రణ్‌బీర్‌గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ జవాన్ గాయపడ్డాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎదురుకాల్పుల్లో గాయపడిన జవాన్‌ను 92 బేస్ హాస్పిటల్‌కు తరలించినట్టు ఆర్మీ 10 సెక్టార్ కమాండర్ నిలేశ్ మిశ్రా తెలిపారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఆర్మీకి చెందిన 29 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కూడా సాగుతోందని పోలీసులు వివరించారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, వీరిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించామన్నారు. గత రెండు నెలలుగా వివిధ ఎన్‌కౌంటర్‌లలో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్క జూన్ నెలలోనే దాదాపు 50 మంది వరకూ ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారంలోనే 9 ఆపరేషన్‌లలో 22 మంది ఉగ్రవాదులు హతమర్యారు. జూన్ 29న హిజ్బుల్ ముజాయిద్దీన్ టాప్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్‌ను సైన్యం హతమార్చడంతో జమ్మూలోని దోడా జిల్లా ఉగ్రవాద రహితమయ్యింది. ఈ ప్రాంతంలో చిట్టచివరి ఉగ్రవాది మసూద్ భట్ సైన్యం కాల్పుల్లో మృతిచెందాడు.
By July 25, 2020 at 11:52AM
No comments