ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు.. ఎమర్జెన్సీ ప్రకటన
ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని ఉత్తర కొరియాలోకి మహమ్మారి తాజాగా అడుగుపెట్టింది. ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదయినట్టు అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి కరోనా అనుమానిత లక్షణాలున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఉత్తరకొరియా తెలిపింది. కరోనా వైరస్ కేసు గురించి ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి. సరిహద్దుల్లోని కేసాంగ్ నగరంలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో వైరస్ విజృంభించకుండా అక్కడ లాక్‌డౌన్ విధించారు. వైరస్ సోకిన వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటి దక్షిణ కొరియా వెళ్లి తిరిగొచ్చినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా పేర్కొంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణాంతక వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు. మూడేళ్ల కిందట దక్షిణ కొరియాకు వెళ్లిపోయిన ఒక వ్యక్తి ఈ నెలలో అక్రమంగా సరిహద్దులు దాటి కెసాంగ్ పట్టణంలోకి జులై 19న ప్రవేశించాడని, అతడికి కోవిడ్ నిర్దారణ అయ్యిందని అధికారిక మీడియా వెల్లడించింది. కాగా, ఉత్తరకొరియా వ్యాప్తంగా మొత్తం 976 పరీక్షలు నిర్వహించామని, ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు కిమ్ జోంగ్ ఉన్‌కు చెప్పారు. అలాగే, కరోనా లక్షణాలున్న 25,551 మందిని క్వారంటైన్‌లో ఉంచామని వారు వివరించారు. ఈ విషయాలన్నింటినీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేశామని తెలిపారు. దేశంలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ సూచనలు చేశారు. చైనా సరిహద్దులను ఇప్పట్లో తెరవబోమని కిమ్ పునరుద్ఘాటించారు. విదేశాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని నిబంధనలు విధించారు. మరోవైపు, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఉత్తర కొరియాను ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆ దేశానికి చెందిన యూంగ్ హీ వర్సిటీ ప్రొఫెసర్ చూ జో-ఉయ్ కోరారు. ఇప్పటికే ఆంక్షల కారణంగా ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న ఉత్తరకొరియాలో వైరస్ విజృంభిస్తే పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయని అన్నారు. ఉత్తర కొరియాలో ప్రస్తుతం దయనీయ పరిస్థితి నెలకుంది, అనుకున్న సమయంలో ప్యాంగ్‌యాంగ్ జనరల్ ఆస్పత్రిని పూర్తిచేయాలేదు.. దక్షిణ కొరియా నుంచి వైరస్ దిగుమతి అయ్యిందని మభ్యపెడుతోంది.. తాము అందజేసే సహాయాన్ని అందుకోడానికి ఉత్తర కొరియాకు ఇదే సరైన సమయం’ అని సియోల్‌లోని కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూనిఫికేషన్ ఫెలో చో హా బమ్ అన్నారు. మరోవైపు వైరస్‌ను అదుపుచేసిని దక్షిణ కొరియాలో గత కొద్ది రోజుల నుంచి పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
By July 26, 2020 at 12:08PM
No comments