కశ్మీర్: ఉగ్రవాదుల స్థావరం ధ్వంసం.. ఇద్దరు ముష్కరుల హతం
జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వాస్తవాధీన రేఖ వెంబడి నౌగమ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించిన సైన్యం.. ఆపరేషన్ చేపట్టి ఇద్దర్ని మట్టుబెట్టింది. ఉగ్రవాదల స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు.. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు ఏకే 47 తుపాకులు సహా యుద్ధ తరహా సోర్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ పీఆర్ఓ వెల్లడించారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ హంద్వారాలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు వివరించారు. శుక్రవారం బందీపొరలో లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతడి నుంచి లైవ్ గ్రనేడ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హజిన్ పట్టణంలోని ఉగ్రవాదుల కదలికలున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించాయి. ఆర్మీకి 13 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ 45వ బెటాలియన్, బందీపొర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా.. లష్కరే తొయిబా ఉగ్రవాది రఫీక్ అహ్మద్ గ్రనేడ్లు విసరడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రయత్నాలను సైన్యం తిప్పికొట్టింది. అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ ఉగ్రవాది రఫీక్.. ఇటీవలే లష్కరే తొయిబాలో చేరినట్టు గుర్తించారు. ఇటీవల హజిన్ వద్ద పోలీసులు, భద్రత బలగాలపై గ్రనేడ్లు విసిరిన ఘటనతోపాటు మరికొన్ని దాడుల్లో పాల్గొన్నాడని తెలిపాయి.
By July 11, 2020 at 10:40AM
No comments