Breaking News

బెంగళూరు, ముంబయిలో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్


కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో మరోసారి మెట్రో నగరాల్లో దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పుణే నగరంలో జులై 14 నుంచి 23 వరకు పది రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. తాజాగా, బెంగళూరు, ముంబయి నగరాలు కూడా అదే బాటలో పయనించనున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్‌ అమలుకు యడియూరప్ప ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 2వేలకు పైగా కేసులు నమోదవుతుంటే, బెంగళూరులోనే సగటున వెయ్యి కేసులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. జులై 14 నుంచి జులై 22 ఉదయం 5 గంటల వరకు వారం పాటు బెంగళూరు నగరం, గ్రామీణ జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. అత్యవసర సేవల మినహా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తారు. కర్ణాటకలో శనివారం 2,798 కేసులు నమోదయ్యాయి. అలాగే 70 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటి కేసుల్లో బెంగళూరులోనే 1,533 వరకు ఉన్నాయని యడ్డీ క్యాబినెట్‌లోని ఓ మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,216కు చేరగా, మృతుల సంఖ్య 613కు పెరిగింది. మహారాష్ట్ర (8,139), తమిళనాడు (3,965) తర్వాత కర్ణాటకలోనే శనివారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. బెంగళూరు నగరంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 16,862కి చేరగా.. 229 మంది మృతిచెందారు. వైరస్ ఉద్ధృతి కొనసాగడంతో మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు మళ్లుతున్నాయి. పుణే, పింప్రి-చించువాడ్, థానే, కళ్యాణ్-దొబివ్లీ, మిరా-భయందేర్ నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు. తాజాగా, ముంబయి మెట్రోపాలిటిన్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు శనివారం ప్రకటించారు. గువహటి, కామ్‌రూప్ జిల్లాల్లో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ అసోం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జులై 19 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్నట్టు తెలిపింది.


By July 12, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-a-rapid-surge-in-covid-19-cases-bengaluru-mumbai-ne-cities-go-for-lockdown/articleshow/76917506.cms

No comments