Breaking News

రసకందాయంలో రాజస్థాన్ రాజకీయం.. సీఎల్పీ భేటీకి 97 మంది హాజరు


రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటుచేసిన శాసనసభా పక్ష సమావేశానికి 97 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి హాజరుకాలేదు. సీఎల్పీ భేటీకి తాను హాజరుకావడంలేదని ఆదివారమే పైలట్ ప్రకటించారు. అంతేకాదు, గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తన వెంట 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, మరికొంత మంది స్వతంత్రుల మద్దతు తనకు ఉందని తెలిపారు. ప్రస్తుతం సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. మరోవైపు, సచిన్ పైలట్ బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. అయితే, సచిన్‌కు ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ నుంచి ఎటువంటి హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన సొంతంగా పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం పీఠంపై పట్టుబడుతున్న సచిన్‌కు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. ‘ప్రగతిశీల కాంగ్రెస్‌’‌గా దానికి నామకరణం చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సీఎల్పీ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, ఆదివారం రాత్రి జైపూర్ లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో, రెండు రోజుల క్రితం సచిన్ పైలట్ వెంట ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో రాజస్థాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.


By July 13, 2020 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-90-mlas-attends-clp-at-rajasthan-cm-ashok-gehlots-residence-in-jaipur/articleshow/76934353.cms

No comments