ముంబయి స్లమ్ ఏరియాల్లో 57 శాతం మందికి కరోనా.. కేంద్రం సర్వేలో వెల్లడి
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సీరలాజికల్ సర్వేలో 23% మందికి ఇప్పటికే కరోనా సోకి తగ్గినట్టు తేలింది. అయితే, ఇప్పుడు ముంబయిలోని మురికివాడల్లో 57% మందికి మహమ్మారి సంక్రమించినట్లు వెల్లడయ్యింది. బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, నీతి ఆయోగ్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో అక్కడి మురికివాడల్లో నివాసంఉంటున్న 57 శాతం మందిలో, మురికివాడల బయట నివసిస్తున్న 16 శాతం మందిలో కొవిడ్-19 రోగ ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) కనిపించాయి. ఇప్పటికే కరోనా సోకిన వీరంతా మహమ్మారి నుంచి కోలుకున్నారు. బాధితుల శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీల కారణంగా వారంతా కరోనా వైరస్‌ను జయించినట్టు గుర్తించారు. ముంబయి ఉత్తర, పశ్చిమ జోన్‌లలోని 3 వార్డుల్లో 6,936 మంది నుంచి జులై 12-14 తేదీల్లో నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇందులో పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ రోగ ప్రతిరక్షకాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. మురికివాడల్లో టాయిలెట్స్, కుళాయిలను ఉమ్మడిగా వాడుకోవడం, అధిక జనసాంద్రత వల్లే వైరస్ ఎక్కువ మందికి సోకిందని నిర్ధారించారు. సీరలాజికల్ సర్వేలో భాగంగా జులై నెల తొలి రెండు వారాల్లో ర్యాండమ్‌గా నమూనాలను సేకరించారు. సాధారణ జనాభాలో ఒక వర్గం రక్త నమూనాలను పరీక్షించి, ఏదైనా వ్యాధికి యాంటీ బాడీలు ఉన్నాయా అనేది పరిశీలిస్తారు. వ్యక్తిగతంగా వ్యాధి బారిన పడినప్పుడు యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. ఇది సాధారణ జనాభాలో వైరస్ ఎంతవరకు వ్యాపించిందో తెలియజేయడమే కాదు, ప్రజల రోగనిరోధక శక్తి వైపు వెళుతున్నారా అని సూచిస్తుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటగా.. 6వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 1.2 కోట్ల మంది జనాభా ఉండగా.. 65 శాతం మురికివాడల్లోనే ఉన్నారు. మిగతా 60 లక్షల మంది చుట్టుపక్కల జిల్లాల్లో నివశిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడ్డవారు లక్షణాలు లేనివారని, మరణాల రేటు 0.05 నుంచి 0.10 శాతం వరకు ఉందని అధ్యయనం పేర్కొంది.
By July 29, 2020 at 08:24AM
No comments