దేశంలో కరోనా: నిన్న ఒక్క రోజే 50వేలకుపైగా కేసులు.. వారంలో 5వేల మంది బలి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 50వేలకుపైగా కేసులు నిర్దారణ అయ్యాయి. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంతేకాదు, దేశంలో మొత్తం కరోనా కేసులు 50వేలకు చేరడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఇప్పుడు ఒక్క రోజులోనే అన్ని కేసులు నమోదుకావడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా 50,362వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 717 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 14,34,851కి చేరగా.. మరణాలు 32,812కి చేరాయి. గతవారంతో పోల్చితే దేశంలో పాజిటివ్ కేసులు 28 శాతం, మరణాలు 19 శాతం పెరిగాయి. దేశంలో ఇప్పటి వరకు ప్రతి ఐదు కరోనా వైరస్ కేసులలో ఒకటి గత వారంలో నమోదయ్యింది. గతవారం (జులై 20-26) దేశంలో మొత్తం 3,17,892 కేసులు నమోదుకాగా.. ఇది అంతకు ముందువారం 2,37,999గా ఉంది. మరణాల విషయానికి వస్తే గతవారం దేశంలో 5,315 మంది ప్రాణాలు కోల్పోగా.. అంతకు ముందు వారం ఇది 4,285 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ అమెరికా, బ్రెజిల్‌లో మాత్రమే 24 గంటల్లో 50వేలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్ ఈ దేశాల సరసన చేరింది. గత ఆదివారం ఒక్క రోజులోనే తొలిసారి 40వేల కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా తొలిసారి జులై 23న 750 మార్క్ దాటాయి. ఆ తర్వాతి రోజు 757 మంది చనిపోగా.. మధ్యలో రెండు రోజులు కాస్త తగ్గాయి. ఆదివారం 717 మంది చనిపోగా.. మహారాష్ట్రలో 267 మంది, తమిళనాడు 85, కర్ణాటక 82, ఆంధ్రప్రదేశ్‌లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. గతవారం దేశంలో 2,17,660 మంది కోలుకున్నారు. అయితే, రికవరీ కేసుల కంటే యాక్టివ్ కేసులు 94,917 ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో ఆదివారం 9,431 కేసులు నిర్దారణ కాగా.. ఆంధ్రప్రదేశ్ 7,627, తమిళనాడు 6,986, కర్ణాటక 5,199 కేసులతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. దేశంలో ఆదివారం నమోదయిన మొత్తం కేసుల్లో 60 శాతం ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
By July 27, 2020 at 08:17AM
No comments