దేశంలో పదేళ్లలో భారీగా తగ్గిన పేదరికం.. దారిద్ర్యం నుంచి 27 కోట్ల మంది బయటకు
పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినట్టు తాజా నివేదిక వెల్లడించింది. పదేళ్లలో 27 కోట్ల మందికిపైగా పేదరికం నుంచి బయటపడినట్టు నివేదిక తేటతెల్లం చేసింది. 2005-06 నుంచి 2015-16 మధ్యకాలంలో 27.30 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని, ఈ దశాబ్దకాలంలో పేదరికం భారీగా తగ్గిందని నివేదిక పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్‌ఐ)లు 75 దేశాల్లో స్థితిగతులను అధ్యయనం చేసి తాజా నివేదిక రూపొందించాయి. భారత్‌లో పరిస్థితులు మెరుగయ్యాయని, పేదల సంఖ్య తగ్గిందని తేల్చింది. మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ఆధారంగా దారిద్య్రాన్ని లెక్కించారు. ఎంపీఐలో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం, పనిలో నాణ్యత, హింస భయం, నివాస ప్రాంతాల్లో వాతావరణం తదితర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. దీని ఆధారంగా 75 దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించినప్పుడు 2000 నుంచి 2019 మధ్య 65 దేశాల్లో పేదరికం తగ్గిందని తేలింది. మొత్తం 50 దేశాలలో పేదరికంలో నివసించే జనాభా సంఖ్య తగ్గినట్టు వెల్లడయింది. ఇక, భారత్‌కు వస్తే దశాబ్దంలో గణనీయంగా ప్రజలు, ముఖ్యంగా పిల్లలు బహుముఖ దారిద్య్రం నుంచి బయటపడ్డారు. కరోనా కారణంగా పరిస్థితులు మారాయని, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని ఓపీహెచ్‌ఐ డెరెక్టర్ సబినా అల్కైర్ తెలిపారు. అర్మేనియా, ఇండియా, నికరాగువా, ఉత్తర మాసిడోనియా దేశాలు ఐదున్నర నుంచి పదిన్నరేళ్లలోపు ప్రపంచ ఎంపీటీ విలువను సగానికి తగ్గించాయని నివేదిక పేర్కొంది. మిగతా వాటితో పోల్చితే ఈ దేశాల్లో పేదరిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని.. ప్రపంచ జనాభాలో ఐదో వంతు ఈ దేశాల్లోనే ఉన్నాయి.. ఇందులో భారత్‌లోనే అధిక జనాభా ఉందని వివరించింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (యూఎన్‌డీఈఎస్ఏ) 2019 నివేదిక ప్రకారం భారతదేశంలో బహుముఖ పేదరికంలో నివసిస్తున్న వారిలో 273 మిలియన్ల మంది బయటపడ్డారు. భారత్, నికరాగువాలో ఇది 10 నుంచి 10.5 ఐదేళ్లలో సాధ్యమైందని తెలిపింది. కాబట్టి, పిల్లలకు నిర్ణయాత్మక మార్పు సాధ్యమే కాని చేతన విధాన ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్, బొలీవియా, ఎస్తేనియా కింగ్‌డమ్, గాబన్, గాంబియా, గునియా, భారత్, లైబీరియా, మాలి, మొజాంబిక్, నైజర్, నికరాగువా, నేపాల్, ర్వండాలు ఈ 14 దేశాల్లో బహుముఖ దారిద్ర్యం నుంచి పెద్ద సంఖ్యలో జనాభా బయటపడ్డారు.
By July 18, 2020 at 08:22AM
No comments