కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. 24 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. దీంతో గడచిన 24 గంటల్లో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. శుక్రవారం ఉదయం కుల్గాంలోని నాగ్‌నాద్-చిమ్మేర్ ప్రాంతంలో ముగ్గురు జైషే మొహమూద్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా, శనివారం ఉదయం షోపియాన్‌లోని అమ్షిపొర ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండగా పూర్తి వివరాలు కాసేపటి తర్వాత వెల్లడించనున్నారు. అమ్షిపొరలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కూడా సాగుతోందని పోలీసులు వివరించారు.
By July 18, 2020 at 07:52AM
No comments