Breaking News

దేశంలో కరోనా విలయతాండం.. నిన్న రికార్డుస్థాయిలో 25వేలకుపైగా కేసులు


దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. బుధవారం రికార్డుస్థాయిలో ఏకంగా 25,530 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఒక్క రోజు నమోదయిన పాజిటివ్ కేసులు 25వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు, వరుసగా ఆరో రోజు కరోనా మరణాలు 400 దాటాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 769,052కి చేరగా.. మరణాలు 21వేల మార్క్‌ చేరాయి. కరోనా నుంచి 4.76 లక్షల మంది కోలుకోగా.. 2.71 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా నిర్దారణ పరీక్షలు పెరుగుతుండగా.. పాజిటివ్ కేసులు అంతే సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆదివారం 1.8 లక్షల పరీక్షలు, సోమవారం 2.41 లక్షలు, మంగళవారం 2.62 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 493 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 21,122కి చేరింది. అయితే, దేశంలో రికవరీ రేటు 61 శాతంగా నమోదుకావడం సానుకూలంశం. మహారాష్ట్రలో మంగళవారం 5,134 కేసులు నిర్ధారణ కాగా.. బుధవారం మళ్లీ కొత్త కేసులు పెరిగాయి. కొత్తగా 6,603 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 2,23,724కి చేరింది. బుధవారం 198 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా మరణాలు 9,448కి చేరాయి. ఇక, మే 12 తర్వాత ముంబయిలో మంగళవారం తొలిసారి పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యింది. కానీ, బుధవారం మాత్రం ఇది రెట్టింపయ్యింది. తమిళనాడులో పాజిటివ్ కేసులు 3,700కుపైగా నమోదయ్యాయి. అయితే, చెన్నైలో వరుసగా ఐదో రోజు 2వేలలోపు కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం 1,261 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ఢిల్లీ ఏకంగా 2,033 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,04,864 వేలకు చేరింది. మరో 48 మంది కరోనాతో చనిపోగా మొత్తం కరోనా మృతులు అక్కడ 3,213గా నమోదయ్యింది. కర్ణాటకలో 2,062, గుజరాత్ 783, బీహార్ 749, కేరళ 301, గోవా 136 మందికి కొత్తగా వైరస్ బయపడింది. అయితే, కర్ణాటకలో రికార్డు స్థాయి మరణాలు బుధవారం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 54 మంది బలయ్యారు. గుజరాత్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,995కి చేరింది. యూపీలో 18, ఆంధ్రప్రదేశ్ 12, తెలంగాణ 11, బెంగాల్ 23, రాజస్థాన్ 10 మంది గడచిన 24 గంటల్లో చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 1,062 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరింది. తాజాగా 12 మంది మరణించగా.. మృతుల సంఖ్య 264కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కేసులు నమోదయ్యాయి. తిరుపతిలోనే వంద వరకు కేసులు వచ్చాయి. తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 1924 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 29,536కు పెరిగింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1590 పా జిటివ్‌లు నిర్ధారించారు.


By July 09, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-fresh-cases-breach-25000-in-a-day-for-first-time-in-india/articleshow/76865430.cms

No comments