దేశంలో కరోనా విజృంభణ: శనివారం 24వేల కొత్త కేసులు.. 608 మరణాలు
దేశంలో మహమ్మారి వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉంది. కేవలం మూడు రోజుల్లోనే పాజిటివ్ కేసులు ఆరు లక్షల నుంచి 6.72 లక్షలకు చేరాయి. దేశంలో ప్రతి రోజూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం 24వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల నుంచి వరుసగా 20వేలకుపైగా కేసులు బయపటడుతున్నాయి. ఇక, దేశంలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా రికార్డుస్థాయిలో 608 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదయిన కరోనా మరణాల్లో రెండో అత్యధికం ఇది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,72,968కి చేరగా.. మరణాల సంఖ్య 19,279కి చేరింది. కరోనా నుంచి 4.09 లక్షల మంది కోలుకోగా.. 2.45 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు భారీగా నమోదయిన దేశాల జాబితాలో రష్యా తర్వాత (6,74,515) భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఆదివారం ఈ రికార్డును భారత్ అధిగమించి మూడో స్థానానికి చేరుకోనుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 7,000కుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక రోజు కేసుల్లో తొలిసారి 7వేల మార్క్ దాటింది. దీంతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో కేసులు నిర్దారణ కావడం గమనార్హం. కర్ణాటక (1,839), బెంగాల్ (743), గుజరాత్ (712), రాజస్థాన్ (480), కేరళ (240) మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గోవాలో తొలిసారి పాజిటివ్ కేసులు 100 మార్క్ దాటాయి. కరోనా మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 16న అత్యధికంగా 2,003 మరణాలు చోటుచేసుకోగా.. దీని తర్వాత శనివారం 608 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 295 మంది ప్రాణాలు కోల్పోగా.. ఢిల్లీ 81, తమిళనాడు 65, కర్ణాటక 42, ఉత్తరప్రదేశ్ 24, గుజరాత్ 21, బెగాల్ 19 మంది ఉన్నారు. దక్షిణాదిలో గత 10 రోజుల నుంచి వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసుల్లో బెంగాల్‌ను వెనక్కునెట్టి తెలంగాణ, కర్ణాటక 6,7 స్థానాలకు చేరాయి. కర్ణాటకలో శనివారం పాజిటివ్ కేసులు 21వేల మార్క్ దాటాయి. బెంగళూరులో ఏకంగా నిన్న 1,000 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 4,280 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసులు 107,001కి చేరుకున్నాయి. అయితే, ఇప్పటి వరకూ 60వేల మందికిపైగా కోలుకోగా.. 44,956 మంది చికిత్స పొందుతున్నారు.
By July 05, 2020 at 08:34AM
No comments