Breaking News

క్లినికల్ ట్రయల్స్‌లో ఆక్స్‌ఫర్డ్ యాంటీబాడీ కిట్‌ సక్సెస్.. 20 నిమిషాల్లోనే ఫలితం


ఒకవేళ ఓ వ్యక్తికి కరోనా సోకితే కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్ని నిర్ధారించే యాంటీబాడీ పరీక్షల నిర్వహించే టెస్టింగ్ కిట్‌లు లండన్‌లో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతమైనట్టు టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. జూన్‌లో రహస్యంగా నిర్వహించిన తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో 98.6 శాతం ఖచ్చితమైన ఫలితాలు వెల్లడయ్యాయని పేర్కొంది. దీంతో, యూకే ప్రభుత్వం వీటిని పెద్ద సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్యతలను మంత్రులకు అప్పగించినట్టు టెలిగ్రాఫ్ పత్రిక శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. ఈ టెస్టింగ్ కిట్‌లను ప్రముఖ సంస్థలతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసినట్టు తెలిపింది. కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ఖర్చుతో కూడుకున్న పని. దీంతో వీటిని ఉచితంగా అందజేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు బ్రిటన్‌లో యాంటీబాడీ పరీక్షలు విశ్లేషణ కోసం ల్యాబ్‌కు నమూనాలు పంపి నిర్ధారిస్తున్నారు. దీనికి ఎక్కువ రోజులు పడుతుంది. ‘ఈ వేగవంతమైన పరీక్ష నిజంగా అద్భుతమైందిగా కనిపిస్తుంది.. దీనిని స్వయంగా మనమే చేసుకోగలం’ అని ప్రభుత్వ యాంటీబాడీ పరీక్షా కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్ రెజియస్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ సర్ జాన్ బెల్ అన్నారు. రాబోయే వారాల్లో ప్రభుత్వం ఆమోదం పొందిన పరిశ్రమల్లో ఇప్పటికే పదివేల ప్రోటోటైప్‌లను తయారు చేసినట్టు తెలిపారు. కాగా, తక్కువ ఖర్చుతో వైరస్‌ను నిర్ధారించే కిట్‌ను ఇటీవల భారత్‌లోనూ కూడా అభివృద్ధి చేశారు. ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధక బృందం రూ.600కే కరోనా నిర్ధారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనితో 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే రూ.350లకే ఈ కిట్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నుంచి అనుమతి లభించగా.. పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు.


By July 18, 2020 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-antibody-test-passes-first-major-trials-in-uk-with-98-6-accuracy-report/articleshow/77029598.cms

No comments