ఆగస్టు 15లోగా వ్యాక్సిన్ అసాధ్యం.. ఐసీఎంఆర్ ప్రకటనపై ఐఏఎస్సీ స్పందన


ప్రభుత్వం విధించుకున్న గడువు ఆగస్టు 15లోగా పరీక్షలు, ప్రక్రియలను వేగవంతం చేయాలని, కరోనా వ్యాక్సిన్ రేసులో ముందుండాలని పరిశోధకులను కోరుతూ ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాసిన లేఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత పరిశోధన సంస్థ విశ్వసనీయత, ఖ్యాతిని ఇది దెబ్బతీసిందని మండిపడుతున్నారు. ప్రకటనపై తాజాగా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విమర్శలు గుప్పించింది. ‘వ్యాక్సిన్ అభివృద్ధిలో అనేక మంది శాస్త్రవేత్తలు అహర్నిషలు శ్రమిస్తున్నారు.. దీనిపై గడువు విధించడం ఆచరణ సాధ్యం కాదు.. ఇది దేశ పౌరుల మనసులో అవాస్తవమైన ఆశను, అంచనాలను పెంచింది’ అని ఐఏఎస్సీ వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో శాస్త్రీయంగా క్లినికల్ ట్రయల్స్ అవసరమని, ఇది అత్యవసరమైనప్పటికీ తొందరపాటు తనం కఠినమైన శాస్త్రీయ ప్రక్రియ, ప్రమాణాల విషయంలో రాజీపడేలా చేస్తుందని పేర్కొంది. ఐసీఎంఆర్ ప్రకటనపై ప్రముఖ నిపుణుడు మైరా శివ మాట్లాడుతూ.. బయోమెడికల్ రిసెర్చ్‌కు సంబంధించి జాతీయ నైతిక మార్గదర్శకాల అభివృద్ధికి ఐసీఎంఆర్ బాధ్యత వహిస్తుంది.. ఇది సమాచార సమ్మతికి సంబంధించిన ప్రక్రియ వివరాలను తెలియజేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం నైతిక మార్గదర్శకాలను అనుసరించడాన్ని మేము చూడాలనుకుంటున్నాం. ఓవైపు, ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తీసుకురావాలని సూచనలు ఇచ్చి, ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షణ సాగుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించాలి. గడువులోగా టీకా తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాల్లో భద్రత, సమర్థతలో సమస్యలు తలెత్తితే ఎవరు జవాబుదారీతనం వహిస్తారు.. హడావుడి క్లినికల్ ట్రయల్ ఫలితాల ఆధారంగా, టీకాను మార్కెట్‌లోకి ప్రవేశపెడితే పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది’ అని హెచ్చరించారు. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రీయత, నైతికత సమీక్ష ప్రక్రియ కోసం కమిటీలను నియమించడం పరిశోధన ప్రక్రియలో భాగం. మీరు వాటిని పాటించడకపోవడం బాధ్యతారహితమైంది.. దీని వల్ల నష్టాలు, సమగ్రతను ఉల్లంఘించే అవకాశం పెరుగుతుంది అని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అండ్ పబ్లిక్ హెల్త్ అడ్వకేట్ ఎడిటర్ అమర్ జైసనీ అన్నారు. బెదిరింపులకు పాల్పడినందున దేశంలోని శాస్త్రవేత్తలకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ క్షమాపణలు చెప్పాలని కోరారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ ఎంపిక ప్రాతిపదికను స్పష్టం చేయాలి, ఎందుకంటే వాటిలో చాలా చిన్న నర్సింగ్ హోమ్‌లు ఇటువంటి పరీక్షలకు అనర్హమైనవి. బయో ఎథిక్స్‌పై పనిచేస్తున్న పరిశోధకుడు అనంత్ భాను మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న సంస్థలు ఉత్తమ పద్ధతులను అనుసరించకపోతే భారతీయ విజ్ఞాన శాస్త్రంపై నమ్మకం పోతుందని అన్నారు.
By July 06, 2020 at 09:11AM
No comments