Breaking News

Unlock 1.0 నేటి నుంచే ఐదో విడత లాక్‌డౌన్.. వీటికి అనుమతిలేదు


మహమ్మారిని నియంత్రించడానికి కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఐదో దశ లాక్‌డౌన్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇది జూన్ 30 వరకూ కొనసాగుతుంది. అయితే, ఈ దశలో కేవలం కంటెయిన్‌మెంట్ జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేసింది. ఈ విడత లాక్‌డౌన్‌లో కంటెయిన్‌మెంట్ జోన్లు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలకు అనుమతించింది. దశల వారీగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించనున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత దశను అన్‌లాక్ 1గా పేర్కొంటూ ఆర్థిక వృద్ధికి దోహదం చేసే కార్యకలాపాలపై తొలుత దృష్టిసారించారు. కరోనా వైరస్‌ కట్టడి ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించి 65 రోజులు గడిచింది. ఒకటో దశ లాక్‌డౌన్ మార్చి 25న ప్రారంభమై 21 రోజుల పాటు కొనసాగింది. ఇది గడువు ముగిశాక రెండో దశ లాక్‌డౌన్ ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకూ విధించారు. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహా కఠినంగా లాక్ డౌన్‌ నిబంధనలు అమలుచేశారు. అయితే, ఈ దశలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజించారు. గ్రీన్ జోన్‌లలో కార్యకలాపాలకు అనుమతించి, ఆరంజ్ జోన్‌లో స్వల్పంగా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. రెడ్ జోన్‌లో మాత్రం ఎలాంటి ఆంక్షలు సడలించకుండా పకడ్బంధీగా అమలు చేశారు. మే 4 నుంచి మొదలైన మూడో దశ లాక్‌డౌన్.. 14 రోజులపాటు కొనసాగి మే 17న ముగియగా.. వెంటనే మే నెలాఖరు వరకూ లాక్ డౌన్ 4ను విధించారు. ఈ సమయంలో దశలవారీగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. లాక్ డౌన్ 3, 4లో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల వారీగా కొన్ని సడలింపులు ఇచ్చారు. తాజాగా లాక్ డౌన్ 5లో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని చోట్ల ఎక్కువ కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. అన్‌లాక్ 1: ఫేజ్-1లో కొత్తగా సడలింపులు. * కొత్త మార్గదర్శకాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూను కాస్త సడలించారు. ఇక నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. * జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, మాల్స్, రెస్టారెంట్లను, హోటళ్లు తెరుచుకొనేందుకు అనుమతించారు. అనుమతి లేనివి ఫేజ్-2 * రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సంప్రదింపుల అనంతరం వాటిని పున:ప్రారంభించడంపై నిర్ణయాన్ని జులైలో ప్రకటిస్తారు. అన్ని విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు, కాలేజీలన్నీ ఈ కోవలోకే వస్తాయి. * వీటి ప్రారంభానికి సంబంధించిన ఎస్ఓపీని కేంద్ర మంత్రిత్వశాఖలు, ఇతర నిపుణులను సంప్రదించి ఆరోగ్య శాఖ రూపొందించనుంది. ఫేజ్-3 అప్పటి పరిస్థితులను బట్టి అంతర్జాతీయ విమానసర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ వంటి వాటికి అనుమతిస్తారు.


By June 01, 2020 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lockdown-5-0-starts-from-today-on-words-to-june-30th-what-will-be-allowed-on-unlock-1-0/articleshow/76127355.cms

No comments