Breaking News

Kakinada: అంతుచిక్కని జంట మరణాలు.. కువైట్ వెళ్తున్నామని చెప్పి కాటికి..


రాత్రి స్నేహితులతో సరదాగా ఆటలాడిన ఇద్దరు యువకులు రేపటి నుంచి కనిపించమనీ.. కువైట్ వెళ్తున్నామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ చెప్పి వెళ్లారు. తెల్లారేసరికి పొలాల్లో శవాలై తేలారు. మద్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నప్పటికీ కనీసం పోస్టుమార్టం కూడా చేయకుండానే యువకులకు దహన సంస్కారాలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంతుచిక్కని జంట మరణాలు తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూశాయి. సమీపంలోని కరప మండలం కొంగోడు ఎస్సీ పేటకు చెందిన సుబ్రహ్మణ్యం(19), దుర్గారావు(24) స్నేహితులు. కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. మామా.. మామా అంటూ క్లోజ్‌గా తిరిగేవారు. పొద్దుపోయే వరకూ స్నేహితులతో ఆటలాడిన యువకులు ఇక నుంచి మీకెవరికీ కనిపించమనీ.. కువైట్ వెళ్లిపోతున్నామని స్నేహితులకు చెప్పారు. వెళ్లొస్తామంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఊరికి సమీపంలోని పొలాల్లో శవాలై తేలారు. మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. కువైట్ వెళ్తున్నామని చెప్పిన ఇద్దరు మిత్రులు మద్యం తాగేందుకు రాత్రి సమయంలో పొలంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అక్కడే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగడంతో చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే జంట ఆత్మహత్యలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం అనుమానాలను రేకెత్తిస్తోంది. Also Read: ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడితే కనీసం పోలీసులకు తెలియజేయకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు తెలిస్తే పోస్టుమార్టం వంటి ఇబ్బందులు ఉంటాయని ఖననం చేయకుండా దహనం చేశారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆ ఇద్దరికీ ఎవరితోనూ వివాదాల్లేవని.. మరణంపై అనుమానాల్లేకపోవడంతోనే అంత్యక్రియలు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరు యువకులు ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కువైట్ వెళ్తున్నామని చెప్పి పొలానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం కూడా అనుమానాలు రేపుతోంది. ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని అలా చెప్పి ఉంటారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా యువకుల మృతికి కారణాలు తెలియకుండానే వారికి అంతిమ సంస్కారాలు జరిపించడం మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. Read Also:


By June 17, 2020 at 01:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-youth-mysterious-death-in-east-godavari/articleshow/76420609.cms

No comments