Breaking News

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. లడఖ్‌లో అత్యాధునిక క్షిపణి వ్యవస్థను మోహరించిన భారత్


సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనాకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌‌లు చక్కర్లు కొట్టడంతో‌ భారత్‌ అప్రమత్తమైంది. తూర్పు లడఖ్‌లో తన అమ్ములపొదిలోని అధునాతన విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థను మోహరించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన క్షిపణులతో కూడిన ఈ సత్వర ప్రతిస్పందన వ్యవస్థ (క్యూఆర్‌ శామ్‌)ను రంగంలోకి దింపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా నిరోధించేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుందని, సైన్యంతోపాటు వైమానిక దళం కూడా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు వివరించాయి. క్యూఆర్‌ శామ్‌ వ్యవస్థలో ‘ఆకాశ్‌’క్షిపణులు ఉంటాయి. వేగంగా దూసుకొస్తున్న యుద్ధ విమానాలు, డ్రోన్లను అవి సెకన్ల వ్యవధిలోనే నేలకూల్చగలవు. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి వీలుగా ఈ వ్యవస్థకు ఇప్పటికే అనేక మార్పులు, ఆధునికీకరణలు చేపట్టారు. కొద్ది వారాల కిందటే సుఖోయ్‌-30 యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను వాస్తవాధీన రేఖ సమీపంలోకి చైనా తరలించింది. ఇవి భారత భూభాగానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గస్తీ తిరుగుతున్నాయి. ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14,15,17, 17ఎ (హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతం), పాంగాంగ్‌ సరస్సు, ఫింగర్‌ ప్రాంతాల వద్ద చైనా హెలికాప్టర్ల కదలికలను మన సైన్యం గుర్తించింది. ఎల్‌ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన ఏర్పడిన నాలుగు ప్రాంతాల్లో రెండు చోట్ల ఉద్రిక్తతలు క్రమేపీ తగ్గుతున్నట్లు సమాచారం. అయితే పశ్చిమ సెక్టార్‌లో మోహరించిన తన బలగాలను వెనక్కి తీసుకుంటానంటూ జూన్ 6 నాటి చర్చల సందర్భంగా ఇచ్చిన హామీని చైనా నిలబెట్టుకోవాల్సిందేనని భారత్‌ పునరుద్ఘాటించింది. ‘సరిహద్దుల్లో ఏకపక్షంగా పరిస్థితులను మార్చేందుకు చైనా ప్రయత్నించింది.. అందువల్ల యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆ దేశానిదే’అని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. సైనిక ప్రతిష్టంభన ద్వారా కొత్తరకం సంప్రదాయాన్ని చైనా సైన్యం కొనసాగించడానికి వీల్లేదన్నది భారత ప్రభుత్వ వైఖరి అని తెలిపారు. చైనా కూడా అక్సాయ్‌ చిన్‌లో విమాన విధ్వంసక క్షిపణులను ఇప్పటికే మోహరించింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను భారత్‌ జాగ్రత్తగా గమనిస్తోంది. తానూ దీర్ఘ శ్రేణి అస్త్రాలను రంగంలోకి దించింది. మరోవైపు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్‌ బలగాల కదలికలపైనా మన సైన్యం కన్నేసి ఉంచింది.


By June 28, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-standoff-iaf-watching-chinese-bases-sure-of-matching-air-power/articleshow/76670225.cms

No comments