పాక్ ప్రతీకార చర్యలు.. భారత దౌత్యాధికారికి ఐఎస్ఐ బెదిరింపులు
దేశంలో గూఢచర్యానికి పాల్పడిన ఇద్దరు పాక్ దౌత్య ఉద్యోగులను కేంద్రం బహిష్కరించడంతో దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా పాక్‌లోని భారత్ రాయబార కార్యాలయం అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత రాయబార కార్యాలయం అధికారి గౌరవ్ అహ్లువాలియాపై గురువారం పాక్ గూఢచారి సంస్థ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాయి. గూఢచర్యానికి పాల్పడిన పాక్ దౌత్య సిబ్బందిని మే 31న భారత్ బహిష్కరించిన తర్వాత.. అక్కడ ఇండియన్ హైకమిషన్ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నాయి. చర్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. పాక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన భారత్.. పాకిస్థాన్ 1992 నాటి వియన్నా దౌత్య ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టింది. ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగించేలా దౌత్యవేత్తలను వేధిస్తోందని విమర్శించింది. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి, తమ అధికారులను బహిష్కరించాలన్న భారత నిర్ణయాన్ని ఖండించాలని డిమాండ్ చేస్తూ అహ్లువాలియాను పాక్ ఒత్తిడి చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం.. మానసిక, శారీరక వేధింపులు, టెలిఫోన్ లైన్ల డిస్‌కనెక్ట్ చేయడం, ఫోన్‌లో బెదిరించడం, కార్లలో వెంబడించడం, అనధికారికంగా నివాసాలలోకి ప్రవేశించడం వంటి చర్యలకు పాల్పడరాదు. గతంలో 2016లొ పాక్ దౌత్య అధికారులను భారత్ బహిష్కరించినప్పుడు దీని ప్రతీకారంగా పాకిస్థాన్.. మన అధికారులను అక్కడ నుంచి పంపేసింది. పాక్‌లోని భారత దౌత్యఅధికారి కారును ద్విచక్రవాహనంతో వెంబడించినట్టు ఓ వీడియోను అధికారులు గురువారం విడుదల చేశారు. అలాగే, అహ్లూవాలియా నివాసం వద్ద పలువురు నిఘా అధికారులు, కార్లు, బైక్‌లతో నిఘా ఉంచినట్టు అందులో ఉంది. పాకిస్థాన్ టిట్ ఫర్ టాట్ చర్యలను కోరుకుంటుంది, కానీ దానికి ఎటువంటి అవకాశం లభించకపోవడంతో.. భారత దౌత్య మిషన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాలని చూస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పాక్ అధికారి సయ్యద్ హైదర్ షా తన కారును కూడా పలువురు వెంబడించారని ఆరోపించారు. తమ విదేశాంగ అధికారులను భారత నిఘా వర్గాలు హింసించాయని తప్పుడు ఆరోపణలు చేసిన పాక్.. ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందని భారత్ ఇంతకు ముందే చెప్పింది. అయితే, గూఢచర్యం కార్యకలాపాలలో పాల్గొని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పాక్ సిబ్బందిని.. ఎప్పుడూ హింసించలేదని భారత్ తిప్పికొట్టింది.
By June 05, 2020 at 10:29AM
No comments