Breaking News

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన: ఓ జవాన్ వీరమరణం.. దాయాదివైపు భారీ నష్టం


జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. తాజాగా పూంఛ్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలోనూ దాయాది విచక్షణరహితంగా కాల్పులకు తెగబడింది. పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో పౌరులు, సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యాలు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు, ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్ సెక్టార్‌‌లోనూ పాక్ దురాగతానికి ఒడిగట్టింది. రామ్‌పూర్ సెక్టార్‌లో ఆదివారం తెల్లవారుజాము నుంచి పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది... పాక్ చర్యలను భారత్ సమర్ధంగా తిప్పికొడుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గడచిన మూడు రోజుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడం ఇది రెండోసారి. అయితే, భారత్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో పాక్ వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. జూన్ 14 ఆదివారం ఉదయం రామ్‌పూర్ సెక్టార్‌లో మోర్టార్ షెల్స్‌, ఇతర ఆయుధాలతో పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది.. దీనికి భారత్ ధీటుగా బదులిస్తోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. ఉరి జిల్లాలోని కమాల్‌కోటే సెక్టార్‌లోనూ శనివారం కాల్పులకు తెగబడింది. రామ్‌పూర్ సెక్టార్‌లో శుక్రవారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో రామ్‌పూర్ సెక్టార్‌లోని బటాగ్రన్‌కు చెందిన జహూర్ అహ్మద్ చెచీ భార్య అఖ్తర్ బేగమ్‌ చనిపోయింది. దాయాది సైన్యం కాల్పుల్లో మరో మహిళ గాయపడగా.. నాలుగు ఇళ్లు, ఓ మసీదు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ పలు కుటుంబాలను సురక్షిత బంకర్లు, ప్రాంతాలకు తరలించారు.


By June 14, 2020 at 01:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-jawan-martyrs-and-two-injured-due-to-pak-army-violates-ceasefire-along-loc-in-j-k/articleshow/76368159.cms

No comments