Breaking News

అమెరికాలో మరో దాష్టీకం.. పోలీసుల చేతిలో ఇంకో నల్లజాతీయుడు బలి


మినియాపొలీస్ ఘటన మరకు ముందే అమెరికాలో పోలీసుల దాష్టీకానికి మరో నల్లజాతీయుడు బలయ్యాడు. దీంతో అగ్రరాజ్యంలో భారీ నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీసు చీఫ్‌ తక్షణమే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆఫ్రో-అమెరికన్ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో మొదలైన ఆందోళనలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించకుంది. పోలీసుల నివేదిక ప్రకారం...‘‘అట్లాంటాలోని వ్యాండీ రెస్టారెంట్ ముందు రెషార్డ్‌ బ్రూక్‌ (27) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు. దీని వల్ల ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలుగుతుందంటూ రెస్టారెంట్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతడు మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బ్రూక్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ప్రతిఘటించడమే కాదు, వారి చేతిలోని తుపాకిని లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకోవడానికి వెంబడించగా.. కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు బ్రూక్‌ను ఆపేందుకు కాళ్లపై కాల్పులు జరిపారు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని.. దాని ఆధారంగానే నివేదిక తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బ్రూక్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహంచారు. కానీ, కొద్దిసేపటికే పరిస్థితి విషమించడంతో బ్రూక్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల వాదనపై అతని కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ వార్త తెలిసిన వెంటనే శనివారం మధ్యాహ్నం నిరసనకారుల భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఘటన జరిగిన రెస్టారెంట్ సమీపంలోని కార్లకు నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేంత వరకూ దాదాపు గంటపాటు మంటలు ఎగిసిపడ్డాయి. దీనిపై స్పందించిన నగర మేయర్‌ కేషా లాన్స్ బాటమ్స్‌.. కాల్పులు జరిపిన పోలీసుని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. అలాగే ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్‌ చీఫ్‌ ఎరికా షీల్డ్స్‌ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.


By June 14, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/police-officer-fired-after-shooting-black-man-dead-in-atlanta-in-us/articleshow/76367557.cms

No comments