Breaking News

తిరుగుబాటు ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని.. నిశితంగా గమనిస్తోన్న భారత్


భారత భూభాగంలోని కాలాపానీ, లిపులేక్, లింపుయాధురాలను తమవిగా పేర్కొంటూ వివాదాస్పద కొత్త మ్యాప్‌ను రూపొందించి, పార్లమెంట్‌లో ఆమోదముద్ర వేసుకున్న నేపాల్.. ఉత్తరాఖండ్‌లోని ధార్చులా సరిహద్దులో ఇరు దేశాలను కలిపే పాదచారుల వంతెనను పలుమార్లు మూసేసింది. అయితే, భారత్‌తో కయ్యానికి కాలుదువున్న ప్రధాని కేపీ ఓలీ వైఖరిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని ఓలీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీలో ఆయన ప్రత్యర్థి దహల్ ప్రచండ విరుచుకుపడ్డారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. తన భూభాగాలను చైనాకు నేపాల్‌ అప్పగించినట్టు వస్తున్న వార్తలను భారత్ నిశితంగా గమనిస్తుండగా.. నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం దీనిని ఖండించింది. నేపాల్‌లో అంతర్గత పరిణామాలపై ఆచితూచి స్పందించిన భారత్.. లాక్‌డౌన్ కొనసాగుతున్నా ఆ దేశానికి అవసరమైన సామాగ్రిని సరఫరాకు కృషి చేసింది. నేపాల్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం మే నెల నాటికి 300 మిలియన డాలర్లకు చేరుకుంది. భారత్, నేపాల్ ప్రజల మధ్య బలమైన బంధం ఉందని, ఇరు దేశాల మధ్య చారిత్రకంగా, సాంస్కృతికంగా సంబంధాలున్నాయని నాలుగు రోజుల కిందట కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ వారం జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రధాని ఓలీ, ప్రచండ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో ప్రచండ.. పార్టీ సభ్యులను ఉటంకిస్తూ ఓలి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు ఖాట్మండ్ పోస్ట్ వెల్లడించింది. ‘దేశంలో పాకిస్థాన్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ మోడల్స్‌ను అనుసరించడానికి కృషి చేస్తున్నట్టు విన్నాం, కానీ అలాంటి ప్రయత్నాలు విజయవంతం కావు’ అని దహల్ అన్నట్టు పేర్కొంది. అన్ని ముఖ్యమైన స్టాండింగ్ కమిటీలలో ఓలీ వర్గానికి అంతగా ప్రాధాన్యత లేదు. అవినీతి ఆరోపణలపై ఎవరినీ జైలుకు పంపించడం సాధ్యం కాదని ప్రచండ వ్యాఖ్యానించారు. "సైన్యం సహాయంతో దేశాన్ని పాలించడం అంత సులభం కాదు.. పార్టీని చీల్చి, ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు’ అని ఆయన సమావేశంలో పేర్కొన్నారు. భారత్‌తో మైత్రికి ప్రచండ కూడా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ, ఒలీతో ఉన్న విబేధాలు కారణంగా భారత ప్రయోజనాలను అణగదొక్కలేడని కేంద్రం బలంగా నమ్ముతుంది.


By June 27, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-watches-as-nepal-prime-minister-kp-oli-faces-revolt/articleshow/76656678.cms

No comments