Breaking News

జొన్నవిత్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. కొంపముంచిన కరోనా


సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తన జాతే గొప్పది అంటూ.. దళితుల మనోభావాలను కించపరిచేలా పద్యం పాడిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని తెలియజేస్తూ... అంతరాని తనాన్ని కొనసాగించేలా ఆయన పాడిన పద్యంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాం ప్రసాద్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నాంపల్లి పోలీసులు సోమవారం నాడు జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిస్సిగ్గుగా తన జాతే గొప్పదని, తన కులమే భారతీయ సంస్కృతి అని.. సోషల్ డిస్టెన్స్ పేరుతో మరోమారు వర్ణ వ్యవస్థను తీసుకువస్తూ విషం వెళ్ళగక్కారంటూ సోషల్ మీడియాలో జొన్నవిత్తులపై మండిపడుతున్నారు దళిత, వెనుకబడిన వర్గాల వారు. అయితే తాను తప్పుగా మాట్లాడలేదని.. నిజంగానే మానవ జాతి ఇప్పుడు ‘మడి’ కట్టుకుని ఉందని తాను ఒక జాతిని కాని, ఒక వర్గం వారిని ఉద్దేశించి పద్యం రాయలేదన్నారాయన. బ్రాహ్మణులు తమ కుటుంబాల్లో పాటించే మడి విధానం గురించే ప్రస్తావించానంటూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తప్పుంటే శిక్షించవచ్చు అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ఈరోజు కరోనా వల్ల ఎవరూ ఎవర్ని తాకడం లేదు. ఇదే కదా మడి అంటే. మరణసయ్యపై మడికట్టుకుని ఉంది మానవజాతి. ఆ మడి కట్టుకోవడం అంటే నువ్ నా దగ్గరకు రాకు.. నేను నీ దగ్గరకు రాని అని. శాస్త్రవేత్తలు కూడా దీన్ని పాటించమని చెప్తున్నారు.. మీరూ కూడా పాటించడి అని నా పాట రూపంలో చెప్పా.. అంతరానితనం, అస్పృశ్యత, కుల వివక్షతలకు తాను వంత పాడలేదన్నారు జొన్నవిత్తుల. అయితే జొన్నవిత్తుల అంటరానితనాన్ని ప్రేరేపించేవిధంగా పద్యం రాయడం.. తిరిగి తన పద్యాన్ని సమర్థించుకోవడంతో దళిత సంఘాలు ఆగ్రహించాయి. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఫిర్యాదు చేయడంతో చివరికి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.


By June 02, 2020 at 08:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sc-st-atrocity-case-filed-against-jonnavithula-ramalingeswara-rao/articleshow/76147766.cms

No comments