Breaking News

మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో చైనా.. వెనక్కు తగ్గేదిలేదంటోన్న భారత్


భారత్, చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన వేసవి పూర్తయ్యేవరకు కొనసాగే సూచనలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దుల్లో ఇరు దేశాలూ సైన్యాలనూ మోహరించగా.. ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగు చోట్ల అదనపు బలగాలను మోహరించారు. గాల్వాన్‌లో మూడుచోట్ల (గాల్వన్ జంక్షన్ లేదా పెట్రోలింగ్ పాయింట్ 14, 15, గోగ్రా 17), పాంగాంగ్ సరస్సు వద్ద సైన్యాలను సిద్ధం చేశారు. అంతేకాదు, సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాల విషయంలో భారత్ వెనక్కు తగ్గబోదని అధికారులు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా కంటే తక్కువ మార్గాలను కలిగి ఉందని, ఘర్షణ జరిగినప్పుడు మరింత మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో భారత్ ముందుకు సాగుతోందనేది స్పష్టమవుతోంది. సైనికులు, ఆయుధాల బలోపేతం చేశామని, ప్రస్తుతం దళాలు, వ్యూహాలలో చైనాతో భారత్ సరిపోలగలదని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు, చైనా చొరబాట్ల సమస్యను స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో పరిష్కరించవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది. అయినప్పటికీ, ఎక్కువ కాలం సరిహద్దుల్లో సైన్యాన్ని ఉంచడానికి కూడా సిద్ధంగా ఉంది.. భారతీయ, చైనా అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వర్గాలు తెలిపాయి. సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మరోసారి సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా, నియంత్రణలోనే ఉందని అన్నారు. ‘దౌత్య, సైనిక కమ్యూనికేషన్ మార్గాలు తెరిచి ఉన్నాయని, రెండు వైపులా చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించగలమని నమ్ముతున్నామని’ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, మీడియాలో వీడియోలు, వివాదాస్పద ఫోటోలతో మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు మాత్రం చైనా ఆపలేదు. భారతీయ సైనికులను చైనా సైనికులు కొడుతున్న వంటి ఫోటోలను ప్రచురిస్తోంది. భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయడంలేదు. డోక్లాం సంక్షోభ సమయంలోనూ ఇదే బాగా పనిచేసింది.


By June 02, 2020 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-china-standoff-at-border-is-likely-to-drag-on-through-the-summer-sources/articleshow/76148823.cms

No comments