Breaking News

కశ్మీర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ముష్కరుల్ని మట్టుబెట్టిన సైన్యం


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం.. తాజాగా, మరో నలుగుర్ని హతమార్చింది. సోమవారం తెల్లవారుజామున షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు కూడా గాయపడినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పింజోర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో సైన్యం, పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ముష్కరులు కాల్పులకు పాల్పడటంతో సైన్యం అప్రమత్తమయ్యింది. సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్న రెబాన్ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలోనే పింజోరా ఉండటం గమనార్హం. తాజా, ఎదురుకాల్పుల్లో రెండు ఇల్లు ధ్వంసమయ్యాయి. జమ్మూ కశ్మీర్ పోలీసుల, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు ఈ ఆపరేషన్‌ను సంయుక్తంగా చేపట్టాయి. ఐదుగురు ముష్కరులు హతమైన 12 గంటల్లోనే మరో భారీ ఆపరేషన్‌‌లో నలుగుర్ని మట్టుబెట్టడం విశేషం. ఆ ప్రాంతంలో మరి కొంత మంది ఉగ్రవాదులు ఉన్నారేమోనని అనుమానిస్తున్న అధికారులు జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా షోపియాన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని రెబాన్ వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఆదివారం (జూన్ 7) ఉదయం నుంచి భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో సీఆర్‌ఫీఎఫ్ జవాన్లు, ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు.


By June 08, 2020 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-terrorists-killed-in-encounter-at-pinjora-area-of-shopian-district-in-kashmir/articleshow/76253256.cms

No comments