Breaking News

ప్రపంచవ్యాప్తంగా కరోనా: 24 గంటల్లో 1.80 లక్షల పాజిటివ్ కేసులు.. ఇదో కొత్త రికార్డ్


కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గతేడాది డిసెంబరులో వెలుగుచూసిన ... మొత్తం ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. రోజురోజుకీ మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. శనివారం ఆదివారం మధ్య గడచిన 24 గంటల్లో ఏకంగా 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేవలం మూడు దేశాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయినట్టు పేర్కొంది. వీటిలో అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771, అమెరికాలో 36,617, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయి. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం వంటి కారణాల వల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 90 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 4.70 లక్షల మంది మృతిచెందారు. వీరిలో దాదాపు 9వేల మంది గడచిన 24 గంటల వ్యవధిలోనే మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కొత్తగా నమోదైన మరణాల్లో మూడో వంతు అమెరికా ఖండాల్లోని దేశాల నుంచే నమోదైనట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 48 లక్షల మందికిపైగా కోలుకున్నారు. మరో 36 లక్షల మందికిపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐరోపాలోని స్పెయిన్‌లో మార్చి 14న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే బ్రిటన్‌ సహా 26 ఇతర ఐరోపా దేశాలకు చెందిన పర్యాటకులకు 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనను తొలగించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని పెడ్రో శాంఛెజ్‌ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం జారీ చేసిన అన్ని నియమ నిబంధనల్ని పాటించాలని కోరారు. వైరస్‌ రెండో విడత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాతో పాటు లాటిన్‌ అమెరికా దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు జాన్‌ హాప్‌కిన్స్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బ్రెజిల్‌లో తొలిసారిగా ఒక్క రోజు వ్యవధిలో 50 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇక అక్కడ మృతుల సంఖ్య 50వేలు దాటింది. అమెరికా తర్వాత మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నది ఇక్కడే. అయినా వైరస్‌ కట్టడి చర్యల్ని అమలు చేయడంలో అధ్యక్షుడు జైల్‌ బోల్సోనారో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


By June 22, 2020 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/who-says-largest-single-day-cases-at-more-than-183000-new-cases-in-the-latest-24-hours/articleshow/76502972.cms

No comments