Breaking News

2 లక్షలకు చేరువలో కరోనా బాధితులు.. కేసులు పెరిగినా తగ్గుతున్న మరణాల రేటు


దేశంలో కరోనా రక్కసి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 8,400పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్రలో అత్యధికంగా 2,300పైగా కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వరుసగా పదో రోజు 2 వేల మార్క్ దాటడం విశేషం. ఇక, పాజిటివ్ కేసుల్లోనూ కొత్త రికార్డు నమోదయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువయ్యింది. కేవలం 14 రోజుల్లోనే లక్ష నుంచి 2 లక్షలకు చేరువకావడం గమనార్హం. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 198,370కి చేరింది. దీంతో అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో ఇటలీ తర్వాత భారత్ 7వ స్థానంలో నిలిచింది. సోమవారం మరో 230 మంది కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడటంతో, మొత్తం మరణాల సంఖ్య 5,608కి పెరిగింది. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 70,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 41,000 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. కోలుకున్నవారి సంఖ్య పెరగడం, మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. 45 రోజుల కిందట 3.3 శాతంగా ఉన్న మరణాల రేటు.. ప్రస్తుతం 2.83 శాతానికి పడిపోయింది. మే 18 నాటికి 3.15 శాతం, మే 3 నాటికి 3.25 శాతంగా ఉంది. కోలుకున్నవారి శాతం 48.19కి పెరగడం సానుకూల పరిణామం. గతంలో మే 18 నాటికి 38.29 శాతంగా.. మే 3 నాటికి 26.59 శాతంగా, ఏప్రిల్ 15 నాటికి 11.42 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 95,754 మంది కోలుకున్నారు. మరో 96,977 మందిలో వైరస్ లక్షణాలు ఉన్నాయి. సోమవారం మహారాష్ట్రలో 2,316, తమిళనాడు 1,164, ఢిల్లీ 990, గుజరాత్ 423 తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాంగా 230 మంది ప్రాణాలు కోల్పోగా ఢిల్లీలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మరణాలు రేటు తగ్గుతోందని, సరైన సమయంలో కేసులను గుర్తించి, వైద్యం అందజేయడంతోనే ఇది సాధ్యమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. లాక్‌డౌన్ సడలింపులు, వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోవడంతో పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు, బాధితుల కోలుకోవడంపైనే ప్రభుత్వం దృష్టిసారిస్తారు. మహారాష్ట్ర, ఢిల్లీ సహ పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో 6.19 శాతంగా ఉండగా.. ఫ్రాన్స్‌లో అత్యధికంగా 19.35 శాతం, బెల్జియం 16.25 శాతం, ఇటలీ 14.33 శాతం, బ్రిటన్ 14.07 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 676 ల్యాబొరేటరీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకూ 38,37,207 నమూనాలను పరీక్షించారు. ఆదివారం అత్యధికంగా 1,00,180 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.


By June 02, 2020 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-rises-to-1-98-lakh-mark-death-toll-at-5600-in-india/articleshow/76147704.cms

No comments