Breaking News

హెచ్-1బీ వీసాలపై డిసెంబరు వరకు నిషేధం.. ట్రంప్ సంచలన నిర్ణయం


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 23 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారినపడగా.. 1.22 లక్ష మంది మృత్యువాతపడ్డారు. దీంతో కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ట్రంప్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీనిలో భాగంగా అధ్య‌క్షుడు ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై మూడు నెలలు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్న‌ట్లు ఏప్రిల్‌లోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా సంక్షోభంతో స్వ‌దేశంలో ఏర్పడిన నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగుతుందని, ఈ మేర‌కు సోమవారం ప్ర‌త్యేక ఆదేశాలు జారీచేశారు. ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది. వ‌ర్క్ వీసాల‌పై నిషేధం జూన్ 24 నుంచి అమల్లోకి వ‌స్తుంద‌ని, 2020 డిసెంబర్ 31 వరకు ఇది అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారిక ప్ర‌క‌టన చేసింది. నాన్-ఇమ్మిగ్రంట్ వీసాలేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, అమెరికా పౌర‌స‌త్వం ఉన్న‌వారి భార్య, పిల్లలు, అదేవిధంగా ఆహార స‌ర‌ఫ‌రా రంగంలో ఉన్నవారికి ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్పష్టం చేసింది. యుఎస్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అర్హత సాధించిన విదేశీ విద్యార్థులకు కూడా ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది. జారీకి అనుసరిస్తున్న ప్రస్తుత లాటరీ వ్యవస్థలో విస్తృత సంస్కరణలకు కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఇది వేతన స్థాయి, నైపుణ్యం స్థాయి రెండింటినీ పెంచుతుంది. ఉద్యోగాల కోసం అమెరికన్లతో పోటీని కూడా తొలగిస్తుంది’ అని ఒ అధికారి తెలిపారు. ఈ సంస్కరణల వల్ల నైపుణ్యం, ప్రతిభ ఉన్నవారు ఉద్యోగాలు పొంది, అధిక వేతనాలు దక్కుతాయి.. అత్యంత ప్రతిభావంతులకు మేలు జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. విదేశీ వర్కర్ల వల్ల అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుండ‌టంతో తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో 525,000 మంది స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే, ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటంతో అమెరికన్ల మద్దతు పొంది.. ల‌బ్ధి పొందాలని ట్రంప్ భావిస్తున్నారు. అందులో భాగంగానే విదేశీయుల‌ను కట్టడి చేసి స్థానికుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డంవ‌ల్ల ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌స్తుంద‌ని ఆయన అంచ‌నా వేస్తున్నారు. అయితే, అమెరికాలో ప్రస్తుతం ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


By June 23, 2020 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-president-donald-trump-suspends-h-1b-h-4-visas-till-year-end/articleshow/76522767.cms

No comments