HappyBirthDayTrisha: ఆమె 20 ఏళ్ల సినీ జర్నీలో డేటింగ్, పెళ్లి క్యాన్సిల్.. ఇంకా ఎన్నెన్నో!!
నేడు (ఏప్రిల్ 4) సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పుట్టినరోజు. 1983 సంవత్సరం సరిగ్గా ఇదే తేదీన జన్మించిన ఆమె ఈ రోజుతో 36 ఏళ్ళు పూర్తిచేసుకొని 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో పాటు సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి త్రిష బర్త్ డే సందర్భంగా ఆమె 20 సినీ జర్నీపై ఓ లుక్కేద్దామా.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన త్రిష.. ఆమె తల్లి సహకారంతో మోడలింగ్ రంగంలో రాణించింది. ఆ తర్వాత తమిళ సినిమా 'జోడీ'తో వెండితెరపై కాలుమోపి ఎన్నో సినిమాల్లో నటించి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో త్రిష నటించిన ఫస్ట్ మూవీ 'నీ మనసు నాకు తెలుసు'. ఈ సినిమాలో ఆమె నటనా ప్రతిభ చూసిన తెలుగు దర్శకనిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలిచ్చారు. ప్రభాస్‌తో నటించిన 'వర్షం' మూవీ ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అందం, దానికి తగ్గ అభినయంతో ఆకట్టుకోవడంలో త్రిష సక్సెస్ అయింది. తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఘనత త్రిష సొంతం. ఇటు కుర్ర హీరోలు, అటు వెటరన్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారితో రొమాన్స్ చేసి రెండు తరాల హీరోయిన్‌గా భారీ క్రేజ్ కొట్టేసింది త్రిష. అప్పట్లో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కూడా త్రిషనే కావడం విశేషం. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు, తమిళ భాషల్లోని సినిమాల్లో తనదైన మార్క్ చూపిస్తోన్న త్రిష జీవితంలో కొన్ని మరచిపోలేని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ మధ్య ప్రభాస్, రానాలతో ప్రేమలో పడిందనే పుకార్లు రావడం.. అనూహ్యంగా పెళ్లి క్యాన్సిల్ కావడం లాంటివి ఆమె లైఫ్‌లో చెప్పుకోదగిన సంఘటనలు. 2015 సంవత్సరం తమిళ నిర్మాత వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. అప్పట్లో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలే చేస్తోంది త్రిష. ఈ క్రమంలోనే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో ఛాన్స్ వచ్చినా వదులుకుంది. దీంతో మెగా అభిమానులు కొంత నిరాశ చెంది ఆమెపై కామెంట్స్ చేశారు. ఏదిఏమైనా ఓ హీరోయిన్ 20 ఏళ్ల పాటు వన్నెతగ్గని గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తూ క్రేజ్ పెంచుకోవడం త్రిషలో స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు. కెరీర్‌లో ఆమె ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీ, మా ''సమయం తెలుగు'' తరఫున త్రిషకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Also Read:
By May 04, 2020 at 10:15AM
No comments