Breaking News

Dasari: టాలీవుడ్ లెజెండ్.. దాసరి నారాయణ వర్థంతి నేడు


దర్శకరత్న దాసరి నారాయణ రావు..... తెలుగు సినిమా ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారు లేరు. చిత్ర పరిశ్రమలో లెజెండ్స్‌గా చెప్పుకోదగ్గ ప్రముఖుల్లో దాసరి ఒకరు. దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పత్రిక అధిపతిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అందరి తలలో నాలుకలా మెదిలిన దాసరి చనిపోయి నేటికి మూడేళ్లు. 2017 మే 30న ఆయన ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయారు. ఇవాళ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్న స్మరించుకుంటున్నారు. 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో దాసరి జన్మించారు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. దాసరి తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. వారిలో దాసరి మూడో వాడు. చిన్నప్పట్నుంచే దాసరికి నాటకాలపైనా, సాహిత్యంపైనా మక్కువ. ఆ ఇష్టంతోనే దాసరి ఏడో తరగతిలోనే ‘నేనూ.. నా స్కూలు’ పేరుతో 15 నిమిషాల నాటిక రాశారు. 1962లో ప్రణాళికా ప్రచారంపై హైదరాబాదులో జరిగిన నాటక పోటీలో రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. దాసరి నారాయణరావు... అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. దాసరి లేకపోయిన ఆయన తీసిన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. గౌరి ప్రొడక్షన్స్‌ భావనారాయణ తాను తీస్తున్న ‘పర్వతాలు పానకాలు’ చిత్రానికి రచయితగా దాసరికి తొలి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’, ‘జగత్‌ కిలాడీలు’, ‘జగజ్జెట్టీలు’, ‘దేవాంతకులు’, ‘స్నేహబంధం’ సినిమాలకి కథకుడిగా, సంభాషణల రచయితగా వ్యవహరించారు. దర్శకుడిగా 1973లో దాసరి ‘తాత మనవడు’ సినిమా తీశారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేయాల్సిన సబ్జెక్టుతో ఆ చిత్రాన్ని రూపొందించి శభాష్‌ అనిపించుకున్నారు దాసరిలోని దర్శకుడు. వయసుమళ్లిన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, తమ సరదాలు, షికార్లే ముఖ్యమనుకొనేవాళ్లకు చెంపమీద కొట్టినట్లుగా ఉండే కథతో, దానికి తగ్గ సంభాషణలతో రచయితగానూ ‘ఇతను మామూలోడు కాదు’ అని గుర్తింపు పొందారు. తెలుగు సినిమా కథని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు దాసరి. ఆయన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి కష్టాలే కథలు. ఈతి బాధలే కథనం. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి.


By May 30, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dasari-narayana-rao-death-anniversary/articleshow/76102880.cms

No comments