Breaking News

వచ్చే వారం మరిన్న శ్రామిక్ స్పెషల్స్: ఒక్కో బోగీకి ఎందరు? టిక్కెట్ ధర ఎంతంటే?


కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు గత నెలన్నరగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేయడానికి పని కరువై.. చేతిలో చిల్లిగవ్వయినా లేకుండా పరాయి పంచన బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వలస జీవులు సొంతూరు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తమను స్వస్థలాలకు పంపించాలని పదే పదే కోరుతుండటంతో ఎట్టకేలకు కేంద్రం వారి మొర ఆలకించింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపునకు ప్రత్యేక రైళ్లు నడపడానికి కేంద్రహోంశాఖ పచ్చ జెండా ఊపింది. దీంతో తొలి రైలు తెలంగాణ నుంచే శుక్రవారం బయలుదేరి వెళ్లింది. కేసీఆర్ ప్రభుత్వం చొరవతో ప్రయాణికుల ప్రత్యేక రైలు హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఝార్ఖండ్‌లోని హతియాకు బయలుదేరి వెళ్లింది. 24 బోగీలున్న ఈ రైల్లో మొత్తం 1,225 మందిని తరలించారు. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు రైలు నడపటంతో ఛార్జీలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక, టిక్కెట్ ధరలకు వస్తే ఎక్స్‌ప్రెస్‌లో రూ.50, సూపర్‌ఫాస్ట్‌రైళ్లలో రూ.20 అదనంగా వసూలు చేయాలని రైల్వేబోర్డు ఆదేశించింది. ఈ రైళ్లకు ‘శ్రామిక్‌ స్పెషల్స్‌’ అని నామకరణం చేశారు. ప్రత్యేక రైల్లో 24 మొత్తం బోగీలుండగా.. వీటిలో 18 స్లీపర్‌, 4 జనరల్‌. స్లీపర్‌లో ఒక్కో బోగీలో 72 బెర్తులుండగా.. సామాజిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించేలా ప్రయాణికుల మధ్య వ్యక్తిగత దూరం కోసం మధ్య బెర్తులు తొలగించారు. ఒక్కో బోగీలో 54 మందినే అనుమతించారు. స్టేషన్‌లోనే వీరికి టికెట్లు ఇచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. వీటికి అదనంగా ఎలాంటి డబ్బులు వసూలుచేయరు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆరు ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. రాబోయే వారాల్లో మరిన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లలో వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఒకే స్టేషన్‌లో దిగే ప్రయాణికులను ప్రత్యేకంగా ఓ బోగీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం వీరి తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ ఆఫీసర్లను నియమించాయి. ఈ అధికారులు గుర్తించి, నమోదుచేసుకున్నవారిని మాత్రమే అనుమంచి, మిగతావారు స్టేషన్‌కు వస్తే టిక్కెట్ ఇవ్వరు. వ్యక్తిగతంగా ఎలాంటి టిక్కెట్లు ఇవ్వబోమని, రాష్ట్ర ప్రభుత్వం తరలించేవారికి మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞ‌ప్తుల మేరకే ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. బయలుదేరాల్సిన ప్రయాణికులను ముందుగా స్క్రీనింగ్ చేసి, కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారణ అయినవారినే అనుమతిస్తామని పేర్కొంది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధనలు పాటించాలి. ప్రస్తుతం లింగంపల్లి-హటియా, అలువా-భువనేశ్వర్, నాసిక్-లక్నో, నాసిక్-భోపాల్, జైపూర్-పాట్నా, కోటా-హటియాల మధ్య శ్రామిక్ స్పెషల్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం 400 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వచ్చేవారం మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకొస్తారు.


By May 02, 2020 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-shramik-special-trains-ferrying-stranded-people-more-to-run-in-coming-weeks/articleshow/75499916.cms

No comments