కరోనా చికిత్సకు గుర్రం నుంచి యాంటీబాడీలు.. హైదరాబాద్ శాస్త్రవేత్తల ప్రయత్నం
బాధితుల చికిత్సకు యాంటీబాడీలను వినియోగించవ్చని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో యాంటీబాడీలను గుర్రాల్లో అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ), సీసీఎంబీ, విన్స్ బయోప్రొడక్ట్స్ కంపెనీ చేతులు కలిపాయి. ఈ మేరకు సీసీఎంబీ, హెచ్‌సీయూతో విన్స్ బయోప్రొడక్ట్స్ సంస్థ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సర్దార్‌సింగ్, విన్స్ సీఈవో సిద్ధార్థ్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా సీసీఎంబీ తరఫున వైరస్ కల్చర్‌ను అందజేయనుండగా.. హెచ్‌సీయూ సాంకేతికతను సమకూర్చనుంది. వీటిని ఉపయోగించి గుర్రాలలో యాంటీబాడీలను వృద్ధిచేస్తారు. వాటిని శుద్ధి చేసి కరోనా బాధితుల చికిత్సకు వినియోగిస్తారు. తక్కువ ఖర్చుతోనే భారీ మొత్తంలో యాంటీబాడీస్‌ను ఈ విధానంలో వృద్ధి చేయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. హెచ్‌సీయూ పరిశోధక బృందానికి యానిమల్ బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నూరుద్దీన్ ఖాన్, సీసీఎంబీ తరఫున ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణన్ హరినివాస్, విన్స్ కంపెనీ తరఫున డాక్టర్ కృష్ణమోహన్ నేతృత్వం వహిస్తారు. హెచ్‌సీయూ వీసీ మాట్లాడుతూ.. ఈ విధానంలో తయారుచేసిన యాంటీ బాడీస్ సమర్థంగా పనిచేయడంతోపాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవని తెలిపారు. విన్స్ బయోప్రొడక్ట్స్ సీఈవో సిద్ధార్థ్ దాగా మాట్లాడుతూ.. మూడు సంస్థల్లోని సాంకేతికత, వసతులను వినియోగించుకుని అతి త్వరలోనే యాంటీవైరల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతోపాటు ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఇమ్యూనోథెరపీపై ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ప్లాస్మా చికిత్స క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ చికిత్స మంచి ఫలితాలనే ఇస్తోంది. దీంతో మరింత ఎక్కువ మందికి ప్లాస్మా చికిత్సను అందజేయాలని భావిస్తున్నారు.
By May 16, 2020 at 09:23AM
No comments