Breaking News

పెళ్లికి ముందు లైంగిక సంబంధం రేప్ కాదు.. ఒడిశా హైకోర్టు సంచల తీర్పు


వివాహం చేసుకుంటానని నమ్మించి యువతితో వివాహేతర సంబంధం కొనసాగించడం అత్యాచారంగా పరిగణించరాదని వ్యాఖ్యానించింది. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా శనివారం హైకోర్టు జస్టిస్‌ ఎస్‌.కె.పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లి చేసుకుంటామని భావించిన కొందరు శారీరకంగానూ కలుస్తున్నారు. యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించరాద’ని కోర్టు అభిప్రాయపడింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు తనను పెళ్లిచేసుకుంటాని నమ్మించి లైంగిక కోరికలు తీర్చుకున్నాడని, తర్వాత పెళ్లికి నిరాకరించాడని 2019లో ఓ బాధిత యువతి పొట్టింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి కారణంగా తాను గర్బం దాల్చినట్టు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం నమోదు చేశారు. ఆ యువకుడు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దిగువ కోర్టు గురువారం దానిని తిరస్కరించింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించడంతో శనివారం దీనిపై విచారణ చేపట్టి బెయిల్‌ మంజూరు చేస్తూ పైవిధంగా అభిప్రాయపడింది. పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకోవడం అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేశారు. ‘భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 375లో అత్యాచారం జరిగినప్పుడు కొన్ని లైంగిక చర్యలను ఏడు రకాలుగా నిర్వచించారు.. మొదటిది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా; రెండోది ఆమె అనుమతి లేకుండా; మూడోది ఆమె సమ్మతితో, మరణ భయం లేదా బాధతో అనుమతించినప్పుడు, నాల్గోది అంగీకారం లేకుండా తన భర్త బలవంతం చేస్తే, ఐదోది తప్పుదారి పట్టించి మత్తులో ఉన్నప్పుడు.. పరిణామాల స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పుడు, ఆరోది 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయి నుంచి సమ్మతి, ఏడోది మహిళ సమ్మతిని తెలియజేసే స్థితిలో లేనప్పుడు’ ఇలాంటి సందర్భాల్లో అత్యాచారంగా పరిగణించాలని జస్టిస్ పాణిగ్రాహి అన్నారు. ఈ కేసు విషయంలో పునఃపరిశీలన అవసరమన్న న్యాయమూర్తి... ఈ విషయంపై చట్టసభ సభ్యుల ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా మహిళలు సమ్మతితో శారీరక సంబంధాన్ని నియంత్రించడానికి అత్యాచార చట్టాలను ఉపయోగించరాదు... సామాజికంగా వెనుకబడిన, సమాజంలోని పేద వర్గాల మహిళలను వివాహం పేరుతో నమ్మించి ఆకర్షిస్తారని, తర్వాత వారు గర్భం దాల్చిన తర్వాత వదిలేస్తారు.. వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయడానికి అత్యాచారం చట్టం తరచూ విఫలమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.


By May 24, 2020 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sex-on-false-promise-of-marriage-does-not-mean-rape-case-say-orissa-high-court/articleshow/75935854.cms

No comments