నిఖిల్ పెళ్లి మళ్లీ వాయిదా.. ఫస్ట్రేషన్‌లో హీరో
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. కరోనాపై కస్సుబుస్సులాడుతున్నారు. ఈ కరోనా పోయేవరకు మళ్లీ పెళ్లి జోలికి వెళ్లనంటున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మూడో విడత లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించడంతో నిఖిల్ పెళ్లి రెండోసారి వాయిదా పడింది. దీంతో నిఖిల్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ‘హైదరాబాద్ టైమ్స్’తో మాట్లాడారు. ‘‘మేం మొదట ఏప్రిల్ 16వ తేదీని ఖరారు చేశాం. కానీ, పెళ్లి తేదీకి సుమారుగా నెల రోజుల ముందు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో, మా రెండు కుటుంబాలు చర్చించుకుని మే 14న పెళ్లి తేదీని నిర్ణయించాం. మళ్లీ ఇప్పుడు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇది చాలా ఫస్ట్రేటింగ్‌గా ఉంది’’ అని నిఖిల్ అన్నారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేంత వరకు తన పెళ్లిని వాయిదా వేస్తున్నానని నిఖిల్ స్పష్టం చేశారు. ఇది నిజంగా తనకు గడ్డుకాలం అన్నారు. అయితే, ప్రస్తుతం బయట చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారితో పోలిస్తే తనకు పెద్ద ఇబ్బందేమీ కాదని తెలిపారు. Also Read: ‘‘నా పెళ్లి వల్ల ఒక్క వ్యక్తికి కరోనా సోకినా, అది జీవితాంతం నన్ను వెంటాడుతుంది. పెళ్లి అనేది మన జీవితంలో ఎంతగానో గుర్తుండిపోయే రోజు కావాలి. కాబట్టి, పెళ్లి అనేది చాలా ఫర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకోవాలని నేను అస్సలు అనుకోను. పల్లవి, నేను ఎన్ని రోజులైనా వేచి చూడగలం. కరోనాను పూర్తిగా నిర్మూలించిన తరవాత మేం వివాహ బంధంతో ఒక్కటవుతాం. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం’’ అని నిఖిల్ వెల్లడించారు. భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 3న నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకుంటున్నారు.
By May 03, 2020 at 11:14AM
No comments