ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్.. అమెరికాలో సాగుతున్న పరిశోధనలు: ట్రంప్ ప్రకటన
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి కోరలు పీకే వ్యాక్సిన్ అభివృద్ధికి ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. పరిశోధనలు పూర్తయి క్లినికల్ ట్రయల్ దాటి మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో శాస్త్రవేత్తలు సైతం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. వాష్టింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలో దీనిపై ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయని.. మరే దేశమైనా తమకంటే ముందే వ్యాక్సిన్ తయారు చేస్తే చాలా సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ‘ఎవరు తయారు చేశారన్నది ముఖ్యం, ఆలోచించాల్సిన విషయం కాదు.. మహమ్మారి మెడలు వంచే వ్యాక్సిన్ వస్తే చాలు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఎదురువుతున్న ముప్పును ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు. ప్రయోగాల కోసం కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నారో వారికి పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందనే విషయంలో ట్రంప్ తన సలహాదారులు, నిపుణుల సూచనలను సైతం పట్టించుకోవడంలేదని స్పష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఈ అంశంపై వైద్యులు తనని మాట్లాడొద్దంటున్నారు.. కానీ, నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా అంటూ తనదైన శైలిలో ట్రంప్ స్పందించడం గమనార్హం. పాఠశాలలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థలను సెప్టెంబరులో తెరవాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. కరోనా సోకిన వ్యక్తి శరీరంలోకి డిస్ఇన్ఫెక్టంట్లను (క్రిమి సంహారకాలు) ఎక్కించడం ద్వారా నాశనమవుతుందని వ్యాఖ్యానించారు. వైద్య నిపుణులు తన సలహా పరిశీలించాలని కూడా అన్నారు. అంతేకాక, శరీరంలోకి అతినీల లోహిత కిరణాలను పంపించడం ద్వారా కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలని ట్రంప్ సూచించారు. దీనిపై పెను దుమారమే రేగింది. తెంపరితనంతో అమెరికా అధ్యక్షుడు పలుసార్లు నోరుజారడం, తర్వాత నాలుక్కురుచుకోవడం ఆయనకు షరా మామూలే.
By May 04, 2020 at 11:09AM
No comments