మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. హాస్పిటల్‌లో చికిత్స
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌కు సోకినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్‌లో ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అశోక్ చవాన్ తన సొంత జిల్లా మరఠ్యాడా, ముంబయి మధ్య తరుచూ ప్రయాణించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల కిందటే చవాన్‌కు వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చవాన్‌కు ఎటవంటి లక్షణాలు లేకపోయిన కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో నాందేడ్‌లో స్థానిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటికే మంత్రి జితేందర్ అవథ్ సైతం కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆయనకు ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో రెండు వారాలకుపైనే చికిత్స కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాటింది. అలాగే మొత్తం కరోనా మరణాల్లో 1,635 మంది మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ముంబయి నగరంలోనే 30వేల మందికిపైగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో రోజు రోజుకూ కొత్త రికార్డులు బద్ధలవుతున్నాయి. ఆదివారం ఏకంగా 3,041 కొత్త కేసులు నమోదుకాగా.. ముంబయిలో అత్యధికంగా 1,725 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 33,988కి చేరింది. ఇప్పటి వరకూ 14,600 మంది కోలుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవీలో కొత్తగా 57 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో కరోనా కేసుల లక్ష వరకు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.38 లక్షలకు చేరగా.. 4,024 మంది చనిపోయారు. కరోనా నుంచి 57 వేల మంది కోలుకున్నారు. అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ 10వ స్థానానికి చేరింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 55 లక్షలకు చేరుకోగా 3.46 లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి 23 లక్షల మంది కోలుకున్నారు.
By May 25, 2020 at 10:13AM
No comments