కరోనాపై స్వతంత్ర దర్యాప్తునకు డబ్ల్యూహెచ్‌ఓ అంగీకారం.. మద్దతు తెలిపిన చైనా!
కరోనా వైరస్‌పై వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న సభ్యదేశాల ఒత్తిడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తలొగ్గింది. వైరస్ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తునకు అంగీకరించిన డబ్ల్యూహెచ్ఓ.. వీలైనంత త్వరలో మదింపు ప్రారంభిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ గ్యాబ్రియోసిస్ వెల్లడించారు. ముందు నుంచి దర్యాప్తును వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా కూడా దీనికి అంగీకరించడం కొసమెరుపు. కరోనా వైరస్‌పై సమగ్ర విచారణ కోసం యూరోపియన్ యూనియన్ చేసిన తీర్మానానికి డ్రాగన్ మద్దతు ప్రకటించింది. సోమవారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సభ 73 వార్షిక సమావేశంలో వైరస్ మూలాలు, ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసిన తీరుపై దర్యాప్తు జరగాలని భారత్ సహా 120కి పైగా సభ్య దేశాలు డిమాండ్ చేశాయి. కరోనాపై పోరుకు వచ్చే రెండేళ్లలో రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15,130 కోట్లు) ఆర్ధిక సాయం అందజేయనున్నట్టు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అంతకుముందు వెల్లడించారు. సోమవారం జెనీవాలో మొదలైన ప్రపంచ ఆరోగ్య సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ... ఇలాంటి విచారణ నిష్పాక్షికంగా, వాస్తవికంగా జరగాల్సి ఉందని, ప్రపంచ దేశాల స్పందనపైనా శాస్త్రీయంగా, వృత్తి నిపుణతతో సమగ్ర సమీక్షను నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరాటం విషయంలో చాలా రోజులుగా తాము పూర్తి జవాబుదారీతనంతో, పారదర్శకంగా స్పందిస్తున్నామని పునరుద్ఘాటించారు. వైరస్ జన్యుక్రమం సహా పూర్తి వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు, ఇతర దేశాలకు అందజేశామని తెలిపారు. విచారణ నిర్వహించాలని ఈయూ చేసిన ముసాయిదా తీర్మానానికి భారత్ సహా 120కి పైగా దేశాలు మద్దతు పలికాయి. అయితే, ముందు నుంచి వైరస్ విషయంలో ఆరోపణలు గుప్పిస్తోన్న అమెరికా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. తీర్మానంలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా.. దర్యాప్తు స్థానంలో మదింపు అనే పదం వాడారు.
By May 19, 2020 at 08:01AM
No comments