Breaking News

నేటి నుంచే మూడో దశ లాక్‌డౌన్.. వీటిపై స్పష్టత ఏదీ? ఆందోళనలో వివిధ వర్గాలు


నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ రెండు దశలు ముగియగా.. మూడో దశ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. రెండు విడతల్లో 40 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించగా.. మూడో దశలో కేంద్రం మరిన్ని మినహాయింపులను ఇచ్చింది. మార్చి 25న లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చేనాటికి 606 పాజిటివ్ కేసులు ఉండగా.. రెండో దశ లాక్‌డౌన్‌ ముగిసే నాటికి 42,000 దాటింది. ఈ 40 రోజుల్లో కేసులు 66 రెట్లు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తగా మరో రెండు వారాల వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. దేశంలో మొత్తం జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించిన కేంద్రం.. అన్ని జోన్‌లలోనూ రైలు, విమానాలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, మిగతా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం విషయంలో జోన్లవారీగా సడలింపులు ఇచ్చింది. దేశంలోని 319 గ్రీన్‌జోన్‌ జిల్లాల్లో ఆంక్షలతో పూర్తిస్థాయి ఆర్ధిక కార్యకలాపాల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో అన్నిరకాల దుకాణాలు తెరచుకోవడానికి అనుమతించింది. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలోనూ రెండు దశల కంటే ఎక్కువ మినహాయింపులను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా గతంలో కంటే ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అనుమతి కల్పించే అంశాలివే.. ⍟ అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి. కంటెయిన్‌మెంట్ జోన్లలో సామాజిక దూరం తదితర నియమాలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి. ⍟ రాష్ట్రాల పరిధిలో గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే బస్సులు నడిపించాలని ఆదేశం. ⍟ ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షల సడలింపు. వ్యక్తిగత వాహనాలకు అనుమతి. కార్లలో ఇద్దరు ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి. ⍟ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి. ⍟ గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి. ⍟ గ్రీన్‌ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వ్యాపారాలకు అనుమతి. ⍟ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించాలి. ⍟ రెడ్‌ జోన్లలో వారానికి ఒకసారి పరిస్థితి పరిశీలించి.. కేసులు తగ్గితే ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు. ⍟ గ్రీన్, ఆరెంజ్ జోన్లో నిత్యావసరాలు, ఔషధ రంగం, వైద్య ఉపకరణలు, ఐటీ, హార్డ్‌వేర్, జ్యూట్ ఇండస్ట్రీ తదితరాలకు నిబంధనలతో అనుమతి. ⍟ నిర్మాణ రంగంలో కొద్ది మంది కార్మికులతో, సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు సాగించేలా అనుమతి. ⍟ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కాల్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీ తదితరాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనుమతి. వీటికి అనుమతిలేదు.. ⍟ విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం. ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర హోం శాఖ అనుమతితో ఈ సేవలకు అనుమతి. ⍟ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌. ⍟ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు బంద్. ⍟ ప్రజలు గుమిగూడటానికి ఆస్కారం ఉన్న అన్ని కార్యక్రమాలపై నిషేధం కొనసాగింపు. అన్ని రకాల ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు. ⍟ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు. అవసరమైన చోట్ల 144 సెక్షన్ విధింపు. ⍟ అన్ని జోన్లలో 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, పిల్లలు, గర్బిణులకు అనుమతి నిరాకరణ. ప్రత్యేక అవసరాలకు మాత్రమే బయటకు రావడానికి అనుమతి. ⍟ కంటెయిన్‌మెంట్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు. ⍟ రెడ్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి లేదు. అయితే, కేంద్రం మార్గదర్శకాల్లో చాలా అస్పష్టత ఉందని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ), అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య (సీఏఐటీ) వంటివి అభిప్రాయపడ్డాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించినా క్షేత్రస్థాయిలో వాటినిఅమలుచేసే బాద్యత రాష్ట్రాలదే. కొన్ని జోన్‌లలో షాపులు, పరిశ్రమలు తెరవడానికి కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించినా ఇళ్లలో పనిచేసే వారికి అనుమతి ఉందా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. చాలా రెసిడెన్షియల్‌ కాలనీలు ప్రస్తుతానికి పని మనుషులను అనుమతించడం లేదు. గత 40 రోజులుగా పనులు లేక ఇళ్లు గడవని స్థితిలో ఉన్న వీరంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తాము పనిచేయడానికి సిద్ధమైనా యజమానులు రావొద్దంటున్నారని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పష్టత ఇస్తే తప్ప వీరి భుక్తి గడిచే పరిస్థితి కనిపించడంలేదు.


By May 04, 2020 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/second-extension-of-lockdown-began-across-country-what-all-you-can-do-from-today-and-what-you-cant/articleshow/75526222.cms

No comments