కమాన్.. టాలీవుడ్‌కు ఓ సోనూసూద్ కావాలి!
ఎస్.. టాలీవుడ్‌కు బాలీవుడ్ నటుడు, విలన్ పాత్రలతో నాకే నేనే సాటి అని నిరూపించుకున్న సోనూసూద్ లాంటి వ్యక్తి కావాలి. అదేంటి టాలీవుడ్‌లో చాలా మందే విలన్లు ఉన్నారు కదా..? పైగా ఆయన కూడా విలన్‌గా నటిస్తున్నారు ఇంకెందుకు మళ్లీ ఆయనలాంటి వారు..? అని అనుకుంటున్నారా..? అస్సలు కానేకాదండోయ్.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. ఇంతకీ ఎందుకు టాలీవుడ్‌కు అలాంటి వ్యక్తి కావాలి..? అసలు అంతలా ఆయనేం చేస్తున్నాడు..? అనే ఆసక్తికర విషయాలు www.cinejosh.com లో తెలుసుకుందాం.
విలన్ కాదు హీరో..!
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం 4.0 లాక్ డౌన్‌ను విధించిన విషయం విదితమే. అయితే ఈ లాక్ డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లడానికి వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు, యాత్రికులు ఇలా చాలా మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎండకు ఎదురీది మరీ కాళ్లు కాల్చుకుంటూ.. భార్య పిల్లలను ఎత్తుకుని నానా తిప్పలు పడుతూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి ఎన్నో విషాద, కన్నీళ్లు తెప్పించే ఘటనలను మనం సోషల్ మీడియాలో.. మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలాంటివన్నీ చూసి చలించిపోయిన సోనూసూద్ తాను సినిమాల వరకే ‘విలన్’ను.. రియల్ లైఫ్‌లో మాత్రం ‘హీరో’ అని నిరూపించుకున్నారు.
ప్రత్యేక బస్సుల్లో..!
వలస కార్మికులను సొంతూళ్లకు తరలించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నప్పటికీ ఇంకా లక్షల్లో కార్మికులు ఎక్కడికక్కడ మిగిలిపోయారు. వారి బాధలను చూసిన సోనూసూద్.. ‘మీకు నేనున్నా’ అంటూ ముందుకొచ్చి వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ తరలించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక అనుమతి తీసుకున్న ఆయన.. చాలా మంది కార్మికులు మహారాష్ట్ర నుంచి గుల్బర్గా, కర్నాటక.. ఉత్తరప్రదేశ్ నుంచి లఖ్‌నవో, జార్ఖండ్, బీహార్‌తో పాటు పలు ప్రాంతాలకు తరలివెళ్లారు. కార్మికులు వెళుతూ వెళుతూ.. మీరు సినిమాల్లో మాత్రమే విలన్ సార్.. బయట మాత్రం హీరోనే.. మా పాలిట దేవుడు లాంటోళ్లు అని వ్యాఖ్యానించారు.
ఎన్నో.. ఇంకెన్నో..!
కాగా ఇదొక్కటే కాదు.. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి సోనూసూద్ ఎన్నో మంచి పనులు చేసి అందరి మన్ననలు పొందారు. మొదట 1500 పీపీఇ కిట్లు పంజాబ్‌లో డాక్టర్లందరికీ ఇవ్వడం.. ఆ తర్వాత ముంబైలోని తన హోటల్‌ను హెల్త్ కేర్ వర్కర్స్ ఇవ్వడం.. రంజాన్ మాసంలో వేలాది మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం.. తాజాగా వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేక బస్సులు నడిపించారు. నిజంగా ఇన్నెన్ని చేసిన సోనూసూద్‌కు ఎవరైనా సెల్యూట్ కొట్టక మానరు అదీ మరి ఆయనంటే..!
మనకూ ఒకరు కావాలి..!
చూశారు కదా.. సోనూసూద్ ఎన్నెన్ని మంచి పనులు చేశారో.. ఇవన్నీ ఒక ఎత్తయితే తనలో ఊపిరి ఉన్నంతవరకూ సాయం చేస్తానని ముఖ్యంగా చిట్టచివరి కార్మికుడు తన స్వగ్రామానికి తరలివెళ్లేంతవరకు ఎంత డబ్బు ఖర్చయినా ఫర్లేదు చేస్తానని ఆయన చెబుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది పెద్దలు, భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు తీసుకున్న వాళ్లు మన టాలీవుడ్‌లోనూ ఉన్నారు. ఇప్పటికే తమవంతుగా విరాళాలు ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు... ఏపీ, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి వారు కన్నీరు కార్చుకుంటున్నారు. అలా ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాం.. కాస్త నిజ జీవితంలోనూ పట్టించుకొని పెద్ద మనసు చాటుకుంటే మంచిది. ప్రభుత్వాలు కూడా చేతనంత చేస్తున్నాయ్.. సోనూసూద్‌ను ఆదర్శంగా తీసుకుని మన టాలీవుడ్ నుంచి ఒకరు బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది.. ఇక ఆలస్యమెందుకు కమాన్.. మీలో ఎవరైనా ఒక్కరొస్తే మీ వెనుక టాలీవుడే ఉంటుందన్న విషయం ఎరిగి ముందుకు రండి.. కమాన్ ఫర్ మైగ్రేంట్ వర్కర్..!
By May 18, 2020 at 04:03PM
No comments