ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు చేరువవుతోన్న కరోనా మరణాలు
కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించింది. వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అటు ఐరోపా దేశాల్లోనూ పరిస్థితి కుదుటపడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా వైరస్ సోకతున్నవారి సంఖ్య కూడా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 43 లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా.. వీరిలో 2.92 లక్షల మంది చనిపోయారు. మరో 16 లక్షల మంది కోలుకోగా.. ఇంకా 24 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 47వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆయా రాష్ట్రాలు శ్రీకారం చుడుతున్నాయి. అయితే, కరోనా వైరస్ బారినపడి అమెరికాలో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉంటుందని కోవిడ్-19పై పోరు కోసం ఏర్పాటైన కార్యదళంలో కీలక సభ్యుడు అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. అమెరికాలో ఇప్పటివరకు 14లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 83 వేలు దాటింది. బ్రిటన్‌లో కొవిడ్ బారిన పడి ఇప్పటివరకు 32 వేల మంది మరణించినట్లు ఆస్పత్రులు విడుదల చేసిన తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 226,463 మంది వైరస్ బారినపడ్డారు. రష్యాలోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే వైరస్ బాధితుల సంఖ్య 2.30 లక్షల దాటగా.. మరణాలు మాత్రం తక్కువే ఉన్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో మరోసారి కొత్త కేసులు నమోదుకావడంతో అక్కడ కోటి మందికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరోపాలోని ఇటలీలో 30,911, స్పెయిన్‌లో 26,920, ఫ్రాన్స్‌లో 26,991, బెల్జియంలో 8,761, జర్మనీలో 7,773 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. స్పెయిన్‌లో 269, 520, ఇటలీలో 221,216, ఫ్రాన్స్‌లో 178,225, జర్మనీలో 173,171, బ్రిటన్ 226,463, టర్కీలో 141,790, బెల్జియం 53,779 మంది వైరస్ బారినపడ్డారు. బ్రెజిల్‌లో మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకూ 178,214 మంది వైరస్ బారినపడగా.. వీరిలో 12,461 మంది ప్రాణాలు కోల్పోయారు.
By May 13, 2020 at 10:42AM
Post Comment
No comments