Breaking News

90 శాతం నిండితేనే శ్రామిక్ స్పెషల్స్.. టిక్కెట్ డబ్బుల బాధ్యత వారిదే: రైల్వే శాఖ


లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన కేంద్రం.. ఇందుకు శ్రామిక్ స్పెషల్స్ పేరుతో రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞ‌ప్తి మేరకు ప్రత్యేక రైళ్లకు పచ్చ జెండా ఊపిన కేంద్రం.. వలస కార్మికుల తరలింపు బాధ్యతలను ఆయా రాష్ట్రాలకే అప్పగించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. కనీసం 90% సీట్లు నిండితేనే శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడపాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ రైళ్లలో వెళ్లాల్సిన వారిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించి, వారికి టికెట్లను అందజేసి, ఆ మేరకు డబ్బులు వసూలు చేసి మొత్తం సొమ్మును రైల్వేకు జమ చేయాల్సి ఉంటుంది. అనుమతి పొందినవారే ఈ రైళ్లలో ప్రయాణించేలా ప్రారంభ స్టేషన్‌లో తగినంత భద్రతను రాష్ట్రాలు సమకూర్చాలని, సరైన టికెట్‌ ఉన్నవారే స్టేషన్‌లోకి ప్రవేశించేలా చూడాలని స్పష్టం చేసింది. ముందుగానే స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహించి, తర్వాత ప్రయాణానికి అనుమతించాలని తెలిపింది. సాధారణంగా ప్రస్తుతం వలస కార్మికులు చిక్కుకున్న ప్రాంతం నుంచి 500 కిలోమీటర్లు దూరం ఉంటే శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు నడపాలని తెలిపింది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు నాన్‌స్టాప్‌గా మార్గమధ్యంలో ఇతర స్టేషన్‌లలో ఆగకూడదు. అలాగే మధ్య బెర్తుల్లో ఎవరూ లేకుండా సామాజిక దూరం పాటిస్తూ ఒక్కో రైలులో సుమారు 1200 మంది ప్రయాణికులను తరలించాల్సి ఉంటుంది. అలాగే 90%పైగా సీట్లు ప్రారంభ స్టేషన్‌లో నిండేలా రాష్ట్రాలు ప్రణాళిక వేసుకోవాలని రైల్వేశాఖ పేర్కొంది. ఆహారం, తాగునీటిని రైలు ప్రారంభమైన స్టేషన్లలోనే ప్రయాణికులకు అందజేయాలని సూచించింది. 12 గంటలకు పైబడిన ప్రయాణమైతే రైల్వే తరఫున ఒక భోజనాన్ని సమకూరుస్తామని, నిబంధనల్ని ఏమాత్రం ఉల్లంఘించినా రైళ్లను ఉపసంహరించుకుంటామని రైల్వే శాఖ ఉద్ఘాటించింది. రైల్వేకి సొమ్ము జమచేయడం రాష్ట్ర ప్రభుత్వాలదే పూర్తి బాధ్యతని, ఇప్పటికే రాజస్థాన్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు చెల్లింపులు చేశాయని తెలిపింది. అలాగే, ఝార్ఖండ్‌కు రెండు రైళ్లు నడపగా.. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని జమచేసిందని పేర్కొది. అయితే, వలస కార్మికుల తరలింపు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపైనే వేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది చాలా అన్యాయమని, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని, వారి పూర్తి బాధ్యత తమదేనని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు వలస కార్మికులకు అదే విధానం అనుసరించాలని సీపీఏం నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు.


By May 04, 2020 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railway-department-issues-guidelines-for-shramik-special-trains-asking-states-to-collect-fare/articleshow/75525420.cms

No comments