దేశంలో 52వేలు దాటిన కోవిడ్ బాధితులు.. నిన్న ఒక్క రోజే 3,600 కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదువుతున్నాయి. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రానికి 50వేల మార్క్ దాటగా... గడచిన 24 గంటల్లో 3,600 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో మహమ్మారి మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 3,602 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,935కి చేరింది. ఐదు రోజుల్లో 30 వేల నుంచి 40వేలకు చేరితే, మూడు రోజుల్లోనే 50వేలు దాటడం ఆందోళన కలిగించే అంశం. ఏప్రిల్ 28 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 30వేలుగా నమోదయ్యింది. మే 3 నాటికి ఇది 40వేలకు చేరితే, మే 7 నాటికి 53వేలకు చేరడం గమనార్హం. మంగళవారంతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగానే నమోదయ్యింది. దేశవ్యాప్తంగా 93 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం ఒక్క రోజే 1,233 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,758 దాటింది. మరో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. అక్కడ మొత్తం కరోనా మరణాలు 651గా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1,777 మంది ప్రాణాలు కోల్పోతే... 36.6 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 396 కొత్త కేసులు, 28 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 6,625కి చేరగా.. మరణాలు 396కి చేరాయి. అహ్మదాబాద్ నగరంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో నిత్యావసరాలు, కూరగాయల అమ్మకాలపై కూడా మే 15 వరకు అధికారులు నిషేధం విధించారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఢిల్లీలో బుధవారం కొత్తగా 428 కేసులు బయటపడగా.. మొత్తం కేసులు 5,532కి చేరాయి. బుధవారం బెంగాల్‌లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో తొమ్మిది మంది, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నలుగురు, ఆంధ్రప్రదేశ్ ముగ్గురు, పంజాబ్, తమిళనాడులో ఇద్దరు, హర్యానా, ఢిల్లీ, ఒడిశాలో ఒక్కొక్కరు చనిపోయారు. తమిళనాడులో ఏకంగా 771 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క చెన్నైలోనే 324 కేసులు ఉన్నాయి. హర్యానాలో 46 కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 595కి చేరింది. రాజస్థాన్‌లో మరో 159 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,317కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 60 కొత్త కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,777గా నమోదయ్యింది. తెలంగాణలో కేవలం 11 కేసులు మాత్రమే రాగా.. బాధితుల సంఖ్య 1,100 దాటింది. యూపీలోనూ 118 మందికి వైరస్ సోకగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,998కి చేరుకుంది.
By May 07, 2020 at 08:52AM
No comments